చివరి టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచిన వెస్టిండీస్... 3-2 తేడాతో టీ20 సిరీస్ కైవసం.. టీ20 సిరీస్‌లో మూడు మ్యాచులు ఓడిన మొదటి భారత కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా చెత్త రికార్డు..
వెస్టిండీస్ టూర్‌లో జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చేతులు ఎత్తేశారు. గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఘన విజయం అందుకున్న తర్వాత కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హార్ధిక్ పాండ్యా, అటు బౌలర్‌గా, ఇటు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత చివరి టీ20లో గెలిచిన వెస్టిండీస్, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది..
హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్ పరాజయం. టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు హార్ధిక్ పాండ్యా. వరుసగా 12 టీ20 సిరీస్‌ల తర్వాత టీమిండియాకి వచ్చిన తొలి సిరీస్ ఓటమి. చివరిగా 2021లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో టీ20 సిరీస్ (కరోనాతో కీ ప్లేయర్లు దూరం కావడంతో) ఓడింది భారత జట్టు.
166 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ని ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు భారత బౌలర్లు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ కలిసి శతాధిక భాగస్వామ్యంతో మ్యాచ్2ని వన్‌సైడ్ చేసేశారు.
5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ కలిసి రెండో వికెట్‌కి 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
12.3 ఓవర్లలో వెస్టిండీస్ 117/1 స్కోరు వద్ద ఉన్నప్పుడు మరోసారి వర్షం రావడం, మబ్బులు కమ్మేయడంతో బ్యాడ్ లైట్‌తో మ్యాచ్ కొంతసేపు నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత అప్పటికే మ్యాచ్‌లో ఓటమి ఖరారు అయిపోవడంతో తిలక్ వర్మతో బౌలింగ్ చేయించాడు హార్ధిక్ పాండ్యా.
అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి బౌలింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ, రెండో బంతికి నికోలస్ పూరన్‌ని అవుట్ చేశాడు. 35 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన నికోలస్ పూరన్, తిలక్ వర్మ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అయితే 14 ఓవర్లు ముగిసే సమయానికి 124 పరుగులు చేసిన వెస్టిండీస్, చివరి 6 ఓవర్లలో 42 పరుగులే కావాల్సిన స్థితికి చేరుకుంది. చాహాల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో వరుసగా 2 సిక్సర్లు బాదిన బ్రెండన్ కింగ్, తిలక్ వర్మ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 4, 6 బాదాడు. దీంతో మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయింది.
బ్రెండన్ కింగ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులు చేయగా, షై హోప్ 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు.
అంతకుముందు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగుల స్కోరు చేసింది.
యశస్వి జైస్వాల్ 5, శుబ్‌మన్ గిల్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
ఈ దశలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ, రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన సంజూ శాంసన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు హార్ధిక్ పాండ్యా.. అక్షర్ పటేల్ 13, అర్ష్‌దీప్ సింగ్ 8, ముకేశ్ యాదవ్ 4 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యాడు.
