రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు.. 1-1 తేడాతో వన్డే సిరీస్‌ని సమం చేసిన వెస్టిండీస్.. 3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్... 

వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌ని 1-0 తేడాతో నెగ్గిన భారత జట్టుకి రెండో వన్డేలో ఊహించని షాక్ తగిలింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, వెస్టిండీస్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో వన్డే సిరీస్ 1-1 సమం అయింది. ఆగస్టు 1న జరిగే ఆఖరి వన్డే, సిరీస్‌ విజేతను డిసైడ్ చేయనుంది..

182 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి మంచి ఆరంభం దక్కింది. కైల్ మేయర్స్, బ్రెండన్ కింగ్ కలిసి తొలి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన కైల్ మేయర్స్‌ని అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, అదే ఓవర్‌లో బ్రెండన్ కింగ్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు..

23 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 6 పరుగులు చేసిన అలిక్ అతనజే కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 బంతుల్లో 9 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు..

91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. అయితే విండీస్ కెప్టెన్ షై హోప్, కెసీ కార్టీ కలిసి ఐదో వికెట్‌కి 91 పరుగుల అజేయ భాగస్వామ్యం జోడించారు. షై హోప్ 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయగా కెసీ కార్టీ 65 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 40.5 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 49 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మోటీ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి వరుసగా ఎనిమిదో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు శుబ్‌మన్ గిల్. గిల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా..

55 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అతనజేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 7 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జేడన్ సీల్స్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా..

చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, రాక రాక వచ్చిన అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన సంజూ శాంసన్, కరియా బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది భారత జట్టు.. 

కొద్దిసేపు విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. 21 బంతులు ఆడి 10 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి చ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

90 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా, ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 22 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.. శార్దూల్ ఠాకూర్ అవుట్ అయ్యాక ఉమ్రాన్ మాలిక్ ఒక్క బంతి ఎదుర్కోగానే భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌కి మరోసారి అంతరాయం కలిగింది...

కొద్దిసేపటి తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. ఉమ్రాన్ మాలిక్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో కార్టీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ ఓ బౌండరీ, కుల్దీప్ యాదవ్ మరో బౌండరీ బాదడంతో టీమిండియా 181 స్కోరు వరకూ అయినా రగలిగింది..