Carlos Brathwaite: వెస్టిండీస్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో గతంలో సన్ రైజర్స్ తరఫున ఆడిన కార్లోస్ బ్రాత్ వైట్ గుర్తున్నాడా..?  కార్లోస్  కాస్తా.. ‘కార్ లెస్’ అయిపోయాడు.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున గతంలో ఆడిన విండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ గుర్తున్నాడా..? అదేనండి.. 2016 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వేసిన ఓ ఓవర్లో నాలుగు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి ఆ దేశానికి పొట్టి ప్రపంచకప్ అందించిన ఆటగాడు. ఆ కార్లోస్ ఇప్పుడు కార్ లెస్’ బ్రాత్ వైట్ అయ్యాడు. కౌంటీ క్రికెట్ కోసమని ఇంగ్లాండ్ వచ్చిన అతడి కారు దొంగతనానికి గురైంది. ఈ బాధతో కార్లోస్ ఆడిన టీ20 మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఈ కథా కమామీషు ఏందంటే..

గాయం కారణంగా ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న బ్రాత్వైట్.. ఓ టీ20 సిరీస్ కోసమని ఇంగ్లాండ్ లో ఆడుతున్నాడు. డోరిడ్డ్ క్రికెట్ క్లబ్ తరఫున మ్యాచ్ ఆడిన బ్రాత్వైట్.. తాను ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.

లెమింగ్టన్ క్రికెట్ క్లబ్ ప్రత్యర్థిగా ఉన్న ఈ 50 ఓవర్ల మ్యాచ్ లో బ్రాత్వైట్.. తొలుత నాలుగు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. గాయం తర్వాత బౌలింగ్ చేసిన అతడు.. వికెట్లేమీ తీయకపోగా భారీగా పరగులిచ్చుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ లో ఓపెనర్ గా వచ్చి డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో డోరిడ్డ్ క్రికెట్ క్లబ్ 12 పరగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా మ్యాచ్ అనంతరం అతడు బయటికెళ్లి చూస్తే కార్లోస్ కారు కూడా అపహరణకు గురైంది.

Scroll to load tweet…

ఈ విషయాన్ని స్వయంగా అతడే తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కార్లోస్ స్పందిస్తూ.. ‘నిన్న చాలా భయంకరంగా గడిచింది. ఆరు నెలల తర్వాత క్రికెట్ ఆడి బౌలింగ్ చేశాను. ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాను. బయిటికొచ్చి చూస్తే నా కారును ఎవరో కొట్టేశారు..’ అని రాసుకొచ్చాడు. 

ఈ ట్వీట్ పై ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. ‘కార్ లాస్ బ్రాత్ వైట్ కు దుర్దినం..’, ‘కార్లోస్ కాస్తా కార్ లాస్ అయిపోయాడు’, ‘కార్ లెస్ బ్రాత్ వైట్ కు నిజంగా ఇది నిరాశకరమైన రోజు..’, ‘ఇది కార్ లాస్ జోకా.. లేక నిజమా..?’ అని నెటి.జన్లు కామెంట్లు చేస్తున్నారు.

Scroll to load tweet…

విండీస్ తరఫున పలు మ్యాచులలో ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్ రౌండర్.. ఐపీఎల్ లో 2018 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కార్లోస్ ను వేలంలో రూ. 2 కోట్లు పెట్టి దక్కించుకుంది హైదరాబాద్. అయితే ఆ సీజన్ లో ఎస్ఆర్హెచ్ తరఫున 4 మ్యాచులాడి 75 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 10 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకున్నాడు. కానీ 2019లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. కేకేఆర్ అతడిని వేలంలో రూ. 5 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్ లో కేకేఆర్ తరఫున 2 మ్యాచులే ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు.