Asianet News TeluguAsianet News Telugu

The Ashes: వెల్ డన్..! బాగా ఆడావ్..!! తనను తానే పొగుడుకున్న ఆసీస్ క్రికెటర్.. వీడియో వైరల్

Australia Vs England: ప్రపంచంలోని ఏ రంగంలో తీసుకున్నా అగ్రస్థాయిలో ఉన్నవాళ్లంతా వాళ్లను వాళ్లు బలంగా నమ్మినవారే. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ లబూషేన్ విషయంలో కూడా ఇది నిజమే అని మరోసారి రుజువైంది.

Well played Marnus, clever : Marnus Labuschagne Talks To Himself at Adelaide Test
Author
Hyderabad, First Published Dec 16, 2021, 7:05 PM IST

మనను మనం నమ్మకుంటే సమాజం ఎలా నమ్ముతుంది..? సెల్ఫ్ బిలీఫ్ గురించి చాలా మంది రచయితలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు పుంఖానుపుంఖాలుగా లెక్చర్లు దంచుతున్నా.. ‘అబ్బే అది మన గురించి  కాదేమో..’ అనుకునేవారే తప్ప దాని గురించి ఆలోచించేవాళ్లు అరుదు. ఆలోచిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవాలు. ఇవాళ ప్రపంచంలోని ఏ రంగంలో తీసుకున్నా అగ్రస్థాయిలో ఉన్నవాళ్లంతా వారిని వారు బలంగా నమ్మినవారే. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ లబూషేన్ విషయంలో కూడా ఇది నిజమే అని మరోసారి రుజువైంది. ఒకవైపు ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లతో విరుచుకుపడుతుంటే.. వాటికి బెదరకుండా.. ‘నువ్వు బాగా ఆడతావ్..’ ‘తెలివిగా ఆడావ్.. గుడ్..’ అంటూ  తనకు తానే  అభినందించుకున్నాడు. 

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా  వన్ డౌన్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ తనను తానే అభినందించుకున్నాడు. ఇంగ్లాండ్ పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లతో పాటు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్,  క్రిస్ వోక్స్ లు బౌన్సర్లతో బెంబేలెత్తిస్తుంటే..  ఒక్కో బంతిని తప్పించుకోవడానికి  బ్యాటర్లు తంటాలు పడుతున్న వేళ.. లబూషేన్ మాత్రం వాటిని ధీటుగా ఎదుర్కున్నాడు. 

 

ఓపెనర్ మార్కస్ హారీస్ (3) త్వరగా ఔట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన లబూషేన్ పై ఒత్తిడి పెంచడానికి ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లు విసిరారు. ముఖ్యంగా   బెన్ స్టోక్స్ విసిరిన బంతులు.. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చాయి. ఈ క్రమంలో  స్టోక్స్ విసిరిన ఓ బంతిని  తప్పించుకున్న లబూషేన్.. ‘చాలా బాగా ఆడావు మార్నస్..తెలివిగా ఆడావు..’ అని తనకు తానే చెప్పాడు. వికెట్లలో ఉన్న మైక్ లలో లబూషేన్ మాటలు రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. 
 
ఇక బెన్ స్టోక్స్ బౌలింగ్ లోనే లబూషేన్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ జోస్ బట్లర్ మిస్ చేయడంతో బతికిపోయిన అతడు.. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 172 పరుగులు జోడించారు.  ఈ క్రమంలో వార్నర్ (95) వరుసగా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేజార్చుకున్నా.. లబూషేన్ (275 బంతుల్లో 95 నాటౌట్) మాత్రం శతకానికి దగ్గరగా ఉన్నాడు. స్టీవ్ స్మిత్ తో కలిసి అతడు క్రీజులో ఉన్నాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్.. 2 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 

 

లబూషేన్ తాజా ప్రదర్శనతో టెస్టులలో ఆసీస్ తరఫున  ఆడుతూ అత్యంత వేగంగా 2 వేల  పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టు అతడికి కెరీర్ లో 20 వ టెస్టు మాత్రమే. 20 టెస్టులు.. 34 ఇన్నింగ్సులలోనే లబూషేన్ 2 వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు  ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (15 టెస్టులలోనే), జార్జ్ హెడ్లీ (17), సట్క్లిఫ్ (22), మైకెల్ హస్సీ (20) ముందున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios