'వెల్‌కమ్ టు సీఎస్కే'... ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి రిషబ్ పంత్
Rishabh Pant joins Ms Dhoni's team: రిషబ్ పంత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్ క్రమంలో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లో పంత్ చేరడం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
Rishabh Pant joins Ms Dhoni's team : రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు అన్ని జట్ల ఫ్రాంఛైజీలతో చర్చలు జరిపింది. ఈ సీజన్ కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పలు నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్టు సమాచారం. ఇదిలావుండగా, ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ టీమ్ కు వీడ్కోలు పలికి ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని క్రికెట్ వర్గల చర్చల నడుమ రిషబ్ పంత్ పోస్టు వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఢిల్లీకి పాంటింగ్ వీడ్కోలు
రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. దీంతో పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఈ స్టార్ బ్యాటర్ చేరతాడనే క్రికెట్ లవర్స్ పేర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కాలం నుంచి ప్రధాన కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ ఫ్రాంచైజీని వీడారు. ఇప్పుడు ఢిల్లీ కొత్త ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిషబ్ పంత్ కూడా వీడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, ఇప్పుడు రిషబ్ పంత్ పోస్ట్ మళ్లీ ఊహాగానాలను వేడెక్కించింది.
రిషబ్ పంత్ పోస్టు వైరల్..
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో.. తాను, ప్రముఖ నటుడు రజనీకాంత్ స్టైలిష్ ఫోజులు ఇస్తున్న చిత్రాన్ని పంచుకున్నాడు. అందులో ఇద్దరూ ఒకే విధంగా కూర్చుని ఫోజులిచ్చారు. ఈ ఫోటో క్యాప్షన్‌లో పంత్ 'తలైవా' అని పేర్కొన్నాడు. రజనీకాంత్‌ని ఆయన అభిమానులు 'తలైవా' అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే, సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనిని తల అని పిలుచుకుంటారు. రిషబ్ పంత్ చేసిన పోస్టును ధోని అభిమానులు, రజినీ అభిమానులు రీట్వీట్ చేస్తూ వెల్ కమ్ టూ చెన్నై అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు పంత్ సీఎస్కే టీమ్ లో చేరబోతున్నారని పేర్కొంటున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ను రిషబ్ పంత్ వీడటం ఎందుకు?
ప్రస్తుతం మీడియాలో వస్తున్న పలు రిపోర్టుల ప్రకారం.. ప్లేయర్ గా రిషబ్ పంత్ రికార్డులు మెరుగైన స్థితిలో ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా ప్రదర్శన పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ సంతోషంగా లేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్, అందులో 3284 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 2016లో పంత్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అప్పటి నుండి అదే జట్టుకు ఆడుతున్నాడు.
ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే నిర్ణయంతో అందరీ కళ్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పైనే..