ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే నిర్ణయంతో అందరీ కళ్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పైనే..
ICC Chairman Election: జైషా ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గా తన సేవలను అందిస్తున్నారు. ఐసీసీ చైర్మన్ పదవికి జైషా నామినేషన్ దాఖలు చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ICC Chairman Election: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం త్వరలోనే ముగియనుంది. బార్క్లే తన పదవీకాలం నవంబర్ 30తో ముగియడంతో మూడోసారి పదవిని చేపట్టేందుకు నిర్ణయించుకోలేదని తెలిపారు. రాబోయే ఐసీసీ చైర్మెన్ ఎన్నికల రేసులో ఉండదలచుకోలేదని ప్రకటించారు. బార్క్లే నిర్ణయం ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శి జైషా భవిష్యత్తుపై ఊహాగానాలు వస్తున్నాయి. చైర్మన్ పదవికి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 27 కాగా, జై షా బరిలోకి దిగుతారని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
జైషా ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గా తన సేవలను అందిస్తున్నారు. క్రికెట్ వర్గాల్లో బలమైన గుర్తింపు ఉన్నందున ఐసీసీ చైర్మన్ పదవికి జైషా నామినేషన్ దాఖలు చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఐసీసీ ఛైర్మన్ పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. వరుసగా మూడు పర్యాయాలు ఐసీసీ ఛైర్మన్ గా సేవలు అందించవచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన అటార్నీ బార్క్లే ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పనిచేశారు. బార్క్లే తొలిసారిగా నవంబర్ 2020లో ఇండిపెండెంట్ ఐసీసీ చైర్‌గా నియమితులయ్యారు. 2022లో మరోసారి తిరిగి ఎన్నికయ్యాడు.
ఐసీసీ ఒక ప్రకటనలో "ఐసీసీ చైర్ గ్రెగ్ బార్క్లే తన ప్రస్తుత పదవీకాలం ముగియగానే మూడోసారి బరిలో నిలవనని తెలిపారు. పదవి నుండి వైదొలుగుతాడని బోర్డుకు స్పష్టం చేశారు. నవంబర్ చివరిలో బార్క్లే 2022లో తిరిగి ఎన్నికయ్యే ముందు నవంబర్ 2020లో స్వతంత్ర ఐసీసీ చైర్‌గా నియమితులయ్యారు" అని పేర్కొంది. ఛైర్మన్ స్థానానికి ఎన్నిక 16 ఓట్లతో ఉంటుంది. గెలవడానికి తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ (51%) అవసరం. ఈ నిబంధనకు ముందు గతంలో చైర్మన్ కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
కాగా, ఐసీసీ ఛైర్మన్ పదవికి రేసులో నిలిచే వారు 27 ఆగస్టు 2024లోపు నామినేషన్లు వేయవలసి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ 1 డిసెంబర్ 2024న జరగనుంది. కేవలం ఒక్కరు మాత్రమే ఉంటే వారు నేరుగా ఎన్నికవుతారు. జైషా ప్రస్తుతం ఐసీసీ బోర్డ్‌రూమ్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ (F&CA) సబ్-కమిటీకి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మొత్తం 16 మంది ఓటింగ్ సభ్యులలో చాలా మంది నుంచి సానుకూల ప్రభావం కలిగివున్నారు.
కాగా, ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఎన్నికైతే సరికొత్త చరిత్ర అవుతుంది. కేవలం 35 ఏళ్ల వయస్సులో, అతను ఐసీసీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలుస్తారు. ఇదివరకు భారత్ నుంచి జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు గతంలో ఐసీసీకి నాయకత్వం వహించారు.