TATA IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రూ. 15.25 కోట్లు వెచ్చించి దక్కించుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ తనదైన మార్కును చూపలేకపోతున్నాడు. వరుసగా చెత్త షాట్లు ఆడి విఫలమవుతున్న అతడిపై హెడ్ కోచ్ జయవర్ధనే కూడా గుర్రుగా ఉన్నాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఇషాన్ కిషన్ ఆట మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ఈ ముంబై ఓపెనర్ తొలి రెండు మ్యాచులలో మినహా తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు. బాగా ఆడటం అటుంచితే కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే.. ఇషాన్ కిషన్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చామని, కానీ ఇలా ఆడటం మాత్రం తమను నిరాశకు గురి చేస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు.
లక్నోతో మ్యాచ్ అనంతరం జయవర్దెనే మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో తన సొంత ఆట ఆడటానికి మేము అతడికి కావాల్సిన స్వేచ్ఛనిచ్చాం.. కానీ అతడు వరుసగా విఫలమవుతున్నాడు. ఇవాళ (లక్నోతో మ్యాచ్ లో) కూడా రోహిత్ భాగా ఆడుతుంటే ఇషాన్ ఇబ్బంది పడ్డాడు.
ఇషాన్ బ్యాటింగ్ గురించి అతడితో మాట్లాడతాం. కానీ అతడి నుంచి మేం ఆశించిందైతే ఇది కాదు. కచ్చితంగా ఈ విషయంలో ఇషాన్ తో మాట్లాడాలి..’ అని మహేళ తెలిపాడు. అంతేగాక ‘మీ జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఓటములకు కారణమా..?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అతడు స్పందిస్తూ..‘మంచి ప్రశ్న. ఈ విషయంలో నేను కూడా ఓసారి రివ్యూ చేసుకోవాలి. మిగిలిన కోచ్ లతో కలిసి మాట్లాడాలి. మా జట్టు బ్యాటింగ్ మాకు అత్యంత ఆందోళనకరంగా ఉంది.
మాకు సహకరించని పిచ్ ల మీద బ్యాటింగ్ చేయకపోవడమంటే అందులో అర్థముంది గానీ మిగతా జట్ల బ్యాటర్లు చెలరేగుతుంటే మా జట్టు ఆటగాళ్లు విఫలమవడమనేది అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. జట్టులో ఉన్నవారిలో చాలా మందికి ఇక్కడి పరిస్థితులు, పిచ్ ల గురించిన పూర్తి అవగాహన ఉంది. దీనిపై మేం దృష్టి సారిస్తాం. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్ లో పలు మార్పులు చేస్తాం.. రాబోయే మ్యాచులలో మీరు అది చూస్తారు..’ అని చెప్పుకొచ్చాడు.
గత మ్యాచులతో పోలిస్తే తమ బౌలర్లు కాస్త బెటర్ అయ్యారని, కానీ ఇంకా మెరుగుపడాల్సింది చాలా ఉందని మహేళ చెప్పాడు. సీజన్ తొలుత ఆ జట్టు బౌలర్ల వైఫల్యం కారణంగానే ఓడింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో కాస్త బాగానే బౌలింగ్ చేశారు. వికెట్లు తీయకున్నా కట్టుదిట్టంగా బంతులు విసరుతున్నారు. కానీ బ్యాటర్లు గాడి తప్పారు. లక్నో తో మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన కెఎల్ రాహుల్ సేన నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని కూడా ముంబై ఛేదించలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, తిలక్ వర్మ వంటి స్టార్ బ్యాటర్లున్నా 132 పరుగులకే పరిమితమైంది. ఇక చెన్నైతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, బ్రెవిస్, కీరన్ పొలార్డ్ ల వైఫల్య ప్రదర్శన ఆ జట్టును ఓటమి అంచుకు నెట్టింది.
