Asianet News TeluguAsianet News Telugu

మల్లయోధులకు కపిల్ డెవిల్స్ మద్దతు.. 83 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కీలక ప్రకటన

Wrestlers Protest: సుమారు 40 రోజులుగా  దేశ రాజధానిలో  తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న  మల్లయోధులకు  1983లో  వన్డే వరల్డ్ కప్ గెలిచిన కపిల్ డెవిల్స్ మద్దతు ప్రకటించింది. 

We are distressed and disturbed : 1983 World Cup Winning Team Came To Support To Wrestlers Protest  MSV
Author
First Published Jun 2, 2023, 4:59 PM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు  బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో  గడిచిన 40 రోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న  మల్లయోధులకు మద్దతు పెరుగుతోంది.  తాజాగా  రెజ్లర్లకు 1983లో వన్డే  వరల్డ్ కప్ గెలిచిన   కపిల్ డెవిల్స్ మద్దతు ప్రకటించింది.  83లో ప్రపంచకప్ గెలిచిన సారథి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు ఈ మేరకు  ఓ ప్రకటనలో రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు.  

గతనెల 28న పార్లెమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా  అటు దిశగా మార్చ్ నిర్వహించిన రెజ్లర్లపై   ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు తమను కలచివేసిందన్న  కపిల్ సేన..  రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలుపుతామన్న డెడ్‌లైన్ పై తొందరపడొద్దని కోరారు. 

ఈ మేరకు ప్రకటనలో.. ‘మా ఛాంపియన్ రెజ్లర్లపై వ్యవహరిస్తున్న దృశ్యాలను చూసి మేం బాధపడ్డాం.  తీవ్ర కలవరానికి లోనయ్యాం.  వారు ఎంతో శ్రమించి  సాధించిన పతకాలను  గంగా నదిలో విసిరేయాలని  ఆలోచిస్తున్నందుకు మేము ఆందోళన చెందుతున్నాం.   ఆ పతకాలు  ఎన్నో ఏండ్ల కృషి,   ఎన్నో త్యాగాలు,    దృఢ సంకల్పం, కఠోర శ్రమతో వచ్చినవి. అవి వారి సొంతం మాత్రమే కాదు. దేశానికి కూడా గర్వకారణం.  ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని మేం వారిని కోరుతున్నాం..’అని ప్రకటనలో పేర్కొన్నారు. 

 

అదే విధంగా వారి ఆవేదనను కూడా ప్రభుత్వం త్వరగా వినాలని  1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కోరింది. వారి సమస్యలను పరిష్కరించాలని తాము ఆశిస్తున్నట్టు  ప్రకటనలో వెల్లడించారు. కాగా ఈ ప్రకటన వెలువరించినవారిలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా ఉండటం గమనార్హం. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్‌నాథ్, కృష్ణమచారి శ్రీకాంత్, యశ్‌పాల్ శర్మ, బిఎస్ సాధు, సందీప్ పాటిల్, కృతి ఆజాద్, రోజర్ బిన్ని, రవిశాస్త్రి లు   ప్రపంచకప్ విన్నింగ్ టీమ్ మెంబర్స్ గా ఉన్నారు. 

1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ప్రకటన తర్వాత దీనిపై  ఇకనైనా టీమిండియా క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర ఫేమస్ క్రికెటర్లు స్పందించాలని  నెటిజన్లు కోరుతున్నారు.   

 

Follow Us:
Download App:
  • android
  • ios