India vs Pakistan: తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చెలరేగాలని.. మళ్లీ క్రికెట్ ప్రేమికులు మునపటి కోహ్లీని చూడాలని అతడి తాజా, మాజీ సహచర ఆటగాళ్లు కోరుకుంటున్నారు.
ఇప్పటికే తన పేరు మీద వందలాది రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. నేటితో మరో ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తో అతడు ఆడబోతున్న మ్యాచ్.. టీ20లలో అతడికి వందో అంతర్జాతీయ మ్యాచ్. తద్వారా అతడు మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడిన తొలి భారత క్రికెటర్ గా రికార్డులకెక్కనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన వందో టీ20 మ్యాచ్ లో చెలరేగాలని మళ్లీ క్రికెట్ ప్రేమికులు మునపటి కోహ్లీని చూడాలని అతడి తాజా, మాజీ సహచర ఆటగాళ్లు కోరుకుంటున్నారు.
ఐపీఎల్ లో కోహ్లీ మాజీ సహచర ఆటగాడు, అతడి స్నేహితుడు.. అభిమానులంతా మిస్టర్ 360 డిగ్రీస్ గా పిలుచుకునే ఏబీ డివిలియర్స్ తో పాటు గత సీజన్ లో ఆర్సీబీతో జట్టుకట్టిన ఫాఫ్ డుప్లెసిస్.. కోహ్లీకి శుభాకాంక్షలు చెప్పారు.
ఇదే విషయమై డివిలియర్స్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ తో మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడిన తొలి భారతీయ క్రికెటర్ గా అవతరించనున్నాడు. ఇది అరుదైన ఘనత. కోహ్లీ.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. వందో టీ20 మ్యాచ్ కు నీకు శుభాకాంక్షలు. నీకోసం ఈ మ్యాచ్ చూస్తా..’ అని తెలిపాడు.
డుప్లెసిస్ స్పందిస్తూ.. ‘హాయ్ విరాట్.. వందో టీ20 మ్యాచ్ ఆడుతున్నందుకు శుభాకాంక్షలు. నీ కెరీర్ లో నువ్వు సాధించిన ఎన్నో రికార్డులతో పాటు ఇది కూడా అరుదైన ఘనత.. ఆసియా కప్ లో మునపటి కోహ్లీని చూడాలని భావిస్తున్నా..’ అని వీడియో మెసేజ్ షేర్ చేశాడు.
మరో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందిస్తూ.. ‘మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడుతున్న కోహ్లీకి శుభాకాంక్షలు. అతడు పరుగుల యంత్రం. మరీ ముఖ్యంగా ఛేదనలో అయితే కోహ్లీ మొనగాడు. కోహ్లీ అసాధారణ బ్యాటర్. మూడు ఫార్మాట్లలో కోహ్లీ సాధించిన ఘనతలు అద్భుతం. ఆల్ ది బెస్ట్..’ అని పేర్కొన్నాడు.
