సౌరవ్ గంగూలీ... బీసీసీఐ అధ్యక్ష పదవి చెప్పటిన నాటి నుంచి చాలా బిజీగా గడుపుతున్నారు. బీసీసీఐలో పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. నవంబర్ లో తొలి పింక్ బాల్ టెస్టు సిరీస్ విజయవంతం చేసి అందరి మన్నలను పొందారు. కాగా... తాజాగా ఆయనను ఆయన ముద్దుల కుమార్తె సనా టీజ్ చేసింది. గతంలో ఒకసారి కూడా ఇదే విధంగా టీజ్ చేయగా.. ఇప్పుడు మరోసారి చేసి అందరి దృష్టి తన వైపుకు ఆకర్షించింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఆదివారం గంగూలీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ  ఫోటోలో ‘ ఆదివారం పనిచేయడం అస్సలు నచ్చదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆయన పోస్టుకి వెంటనే సనా గంగూలీ స్పందించింది. ‘ పనిచేయకుండా 12గంటల వరకు బెడ్ మీద ఎవరుంటారో చెప్పండి’ అంటూ సరదాగా కామెంట్ చేసింది.

గతంలోనూ... గంగూలీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో పెడితే ఇలానే టీజ్ చేసింది. అప్పుడు తండ్రీ, కూతుళ్ల సంభాషణ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పౌరసత్వ సవరణ బిల్లుపై కూడా సనా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ ఆమె ఆ ఫోస్టు పెట్టింది.

కాగా.. కూతురు పెట్టిన పోస్టుపై గంగూలీ స్పందించారు. తన కూతురు ఇంకా చిన్న పిల్ల అని.. తనను రాజకీయాల్లోకి లాగొద్దని నెటిజన్లను కోరారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేంత పరిపక్వత తన కూతురికి ఇంకా రాలేదని ఆయన తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం సనా ధైర్యాన్ని తెగ మెచ్చుకున్నారు.