అంతర్జాతీయం:  భారత్ లో ఐపిఎల్ మాదిరిగానే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ను మరింత ఆకర్షణీయంగా, ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు మూడు కొత్త నిబంధనలను తీసుకువచ్చారు నిర్వహకులు. అయితే ఈ నిబంధనలు ఆటను తప్పుదారి పట్టించేలా వున్నాయని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. 

''బిగ్ బాష్ లీగ్ నిర్వహకులు జిమ్మిక్కులతో ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తున్నారే తప్ప ఆట నాశనం అవుతున్న విషయాన్ని గుర్తించడంలేదు. పవర్‌ సర్జ్‌, ఎక్స్‌-ఫ్యాక్టర్‌, బాష్‌ బూస్ట్ నిబంధనల గురించి చదివాను. టోర్నీ గురించి ఆలోచించడమే కాదు ఆట గురించి కూడా ఆలోచించి ఈ నిబంధనలపై నిర్ణయం తీసుకుంటూ బాగుండేది'' అని వాట్సన్ అభిప్రాయపడ్డారు. 

ఏమిటీ నిబంధనలు: 

ఎక్స్ ఫ్యాక్టర్: అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు కేవలం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అనుమతి వుంటుంది. కానీ ఈ నిబంధన ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్ చేయొచ్చు. 

పవర్ సర్జ్: ఇది కూడా బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా వుండేలా తీసుకువచ్చిన నిబంధన. టీ20లో మొదటి ఆరు ఓవర్లు పవర్ ప్లే వుండగా దాన్ని నాలుగు ఓవర్లకు కుదించారు. మిగతా రెండు ఓవర్ల పవర్ ప్లే ను బ్యాటింగ్ జట్టు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. 

బాష్ బూస్ట్: ఈ నిబంధన ప్రకారం ఏ జట్టయితే తొలి పది ఓవర్లలో అత్యధిక పరుగులు చేస్తుందో ఆ జట్టుకు ఒక బోనస్ పాయింట్ లభించనుంది. 
రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉంటే తలో అర పాయింటు ఇస్తారు.