టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగిపోయారు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి..? ఇప్పుడు ధోనీ మ్యాచ్ లు ఏమీ ఆడట్లేదు కదా.. ఈ సిక్సర్లు ఎక్కడ కొట్టాడు అనే కదా మీ సందేహం. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది కదా.. దాని కోసం ముందుగానే ధోనీ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ట్రైనింగ్ క్యాంప్ లో ఈ సిక్సర్ల వర్షం కురిపించాడు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్‌ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల తో చెలరేగిపోయాడు.

దాదాపు గంట సేపు ప్రాక్టీస్‌ కొనసాగించిన ధోని ప్రాక్టీస్‌ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది. ధోని ఒక్కో షాట్‌ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ భారత్‌లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.