Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-ఇంగ్లాండ్ టెస్టుకు ముందే మొదలైన రగడ.. పడుకున్న సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటది మరి..

Wasim Jaffer vs Michael Vaughan: భారత జట్టు ఇంగ్లాండ్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నది.  గతేడాది అర్ధాంతరంగా మిగిలిపోయిన టెస్టును జులై 1 నుంచి ఆడనున్నది. 

Wasim Jaffer Strong Counter To England Ex captain Michael Vaughan
Author
India, First Published Jun 22, 2022, 2:35 PM IST

క్రికెట్ చరిత్రలో కొన్ని సమరాలు ఆసక్తికరంగా ఉంటాయి.  ఇండియా-పాకిస్తాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-ఆస్ట్రేలియా.. ఈ జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన  ఆసక్తి ఏ మాత్రం తగ్గదు. ఈ స్థాయిలో కాకపోయినా నేటి డిజిటల్ యుగంలో క్రికెట్ మీద  సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మధ్య జరిగేదే. ఒకరిమీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకోవడంలో ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గరు. వీళ్ల ట్విటర్ వార్  ఇరు దేశాల అభిమానులకు కావాల్సినంత ఫన్ ను పంచుతున్నది. 

తాజాగా  టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐదో టెస్టుకంటే ముందే ఈ ఇద్దరూ ట్విటర్ లో ట్వీట్ల వార్ కు దిగారు. 

అలా మొదలైంది.. 

జూన్ 21న జాఫర్.. ట్విటర్ వేదికగా తాను లార్డ్స్ మైదానంలో కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. ‘సూర్యుడు ప్రకాశవంతంగా  వెలుగుతున్నాడు. ఇక్కడి వాతావరణం బాగుంది’ అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు. కానీ మైఖేల్ వాన్ ఊరుకుంటాడా..? అబ్బే.. ఆ ఛాన్సే లేదు. ఈ ఫోటోకు వాన్ స్పందిస్తూ.. ‘నేను తొలి టెస్ట్‌ వికెట్‌ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా వసీం..? అని ట్వీటాడు. 

 

జాఫర్ ఇలా ముగించాడు... 

వాన్ ట్వీట్ కు మనోడికి ఎక్కడో కాలింది.  వాన్ ట్వీట్ కు బదులుగా 2007లో భారత జట్టు ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన ఫోటోను షేర్ చేస్తూ..  ‘లేదు మైఖేల్..  దీని 15వ వార్షికోత్సవం సందర్బంగా ఇక్కడికి వచ్చా..’ అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. అంతే మై‘ఖేల్ ఖతం’ అయిపోయింది. జాఫర్ కౌంటర్ కు వాన్ దగ్గర సమాధానం లేదు. 

 

 

అభిమానులకు పండగ.. 

ఈ ఇద్దరి ట్వీట్లు అభిమానులకు కావల్సిన ఫన్ ను పంచుతున్నాయి.  ‘పడుకున్న సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటుంది వాన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.  ఇదిలాఉండగా టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. నాటింగ్హమ్‌  లో జరిగిన టెస్టులో వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లాండ్ గెలవలేదు. ఈ మ్యాచ్ లో జాఫర్ అర్థ సెంచరీ సాధించాడు.  2007 తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ కోసం తపిస్తున్న టీమిండియాకు ఇప్పుడు  మంచి ఛాన్స్ వచ్చింది.  గతేడాది ముగిసిన నాలుగు టెస్టులలో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా భారత్ దే సిరీస్ కానుంది. ఓడితే మాత్రం 2-2తో సిరీస్ సమమవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios