అమ్మాయిలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఛాతీని, భుజాలను పెంచుకోవడానికి తాను వ్యాయామం చేశానని, కాళ్లను పూర్తిగా పట్టించుకోలేదని, ఆ తప్పిదానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రే రస్సెల్ చెప్పాడు.
దుబాయ్: అమ్మాయిలకు సెక్సీగా కనిపించాలని తాను చేసిన పొరపాటుకు ఇప్పుడు అనుభవిస్తున్నానని వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రే రస్సెల్ చెప్పాడు. ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ట్వంటీ20 క్రికెట్ లో అత్యంత విలువైన ఆటగాడనే విషయం తెలిసిందే. అమ్మాయిలను ఆకర్షించడానికి తాను చేసిన పని వల్ల మోకాళ్లలో నొప్పిని పట్టించుకోలేదని ఆయన చెప్పాడు.
యువ క్రికెటర్లకు ఆయన సలహా ఇస్తూ మరో రస్సెల్ కావాలని అనుకుంటున్నవాళ్లెవరికీ తనకు జరిగింది జరగకూడదని ఆయన అన్నాడు. తాను 23, 24 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనకు మోకాళ్ల నొప్పులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పాడు. దాని నుంచి బయటపడడానికి ఈ వ్యాయామం చేయాలని ఎవరైనా చెప్పి ఉంటే తనకు ఈ బాధ ఉండేది కాదని అన్నాడు.
తాను 23 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఎవరికీ భయమనేది ఉండదని, నొప్పిని పట్టించుకోకుండా తాను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ పరుగెత్తేవాడినని ఆయన చెప్పాడు. ఇరవై ఏళ్ల వయస్సు ముగిసే సమయానికి మోకాళ్ల నొప్పి భరించలేనంతగా రావడం మొదలైందని అన్నాడు. మోకాళ్లకు అవసరమైన వ్యాయామం చేసి ఉంటే ఆ బాధ ఉండేది కాదని అన్నాడు.
శరీరం పైభాగం గురించి మాత్రమే యువత ఆలోచించకూడదని ఆయన అన్నాడు. తాను జిమ్ వెళ్లేవాడినని, తన భుజాలను, ఛాతీని పెంచుకోవడానికి మాత్రమే వ్యాయామం చేశానని, తద్వారా అమ్మాయిలను ఆకర్షించాలని అనుకున్నానని, సెక్సీగా కనిపిస్తూ చివరికి కాళ్లు బలహీనపడిపోయాయని ఆయన అన్నాడు. అది మంచిది కాదని అన్నాడు.
శరీరం మొత్తానికి వ్యాయామం ఉండాలని, తన మోకాళ్ల కోసం వ్యాయామం చేసి ఉంటే మరిన్ని అద్భుతాలు చేసి ఉండేవాడినని చెప్పాడు.మోకాళ్ల నొప్పితో బాధపడుతూ తాను చేయాలనుకున్నదాని చేయలేని స్థితి వచ్చిందని. అయితే, నిలబడి ఫోర్లూ సిక్స్ లూ కొట్టగలనని అన్నాడు.
