మాజీ ఎంపీ, బిజెపి నాయకులు వివేక్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ షాకిచ్చింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో వివిధ పదవుల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీంతో  క్రికెట్ వ్యవహాల్లో చురుగ్గా పాల్గొనే వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని ఆశించాడు. ఇందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు.  అయితే పరిశీలన దశలోనే ఈ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో వివేక్ అధ్యక్ష ఆశలు గళ్లంతయ్యాయి. 

ఇటీవలే హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా వివిధ పదవుల కోసం చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే గత గురువారం మాజీ ఎంపీ వివేక్ కూడా అధ్యక్ష పదివికి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.శుక్రవారం ఈ ప్రక్రియ  ముగియడంతో శనివారం  నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ  క్రమంలో వివేక్ నామినేషన్ నిబంధనలకు విరుద్దంగా వుండటంతో తిరస్కరణకు గురయినట్లు హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్‌ సంపత్‌  వెల్లడించారు. 

వివేక్ అధ్యక్ష పదవి రేసులోంచి తప్పుకోవడంతో మాజీ  క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ కు మార్గం సుగమైంది. అతడితో సహా మరో 10మంది అధ్యక్ష పదవి రేసులో నిలిచారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశముంది. కాబట్టి చివరి పోటీలో నిలిచే అభ్యర్థులు ఎంతమందో ఆ తర్వాతే తేలనుంది. ప్రస్తుతానికి అధ్యక్ష 10, ఉపాధ్యక్ష 14, కార్యదర్శి 13, సంయుక్త కార్యదర్శి 11, కోశాధికారి పోస్టులకు 11 మంది  పోటీలో వున్నట్లు సంపత్ ప్రకటించారు.  ఈ నెల  27వ తేదీన హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.