Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య... వీరేంద్ర సెహ్వాగ్ మంచి మనసు...

ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్...  విరాట్ కోహ్లీ రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు పుకార్లు.. 

Virender Sehwag offers free education for Odisha train Accident victims in his school CRA
Author
First Published Jun 5, 2023, 11:34 AM IST

ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారతీయ రైల్వే చరిత్రలో అతి పెద్ద విషాదంగా పిలవబడుతున్న ఈ ప్రమాదంలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోయారు.  1100 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం...

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారం ప్రకటించింది..

ఈ సంఘటనపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాధిత కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చాడు. 

‘ఈ దృశ్యాలు మనల్ని చాలా కాలం పాటు వెంటాడుతాయి. ఈ విషాద సమయంలో ఈ దారుణ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుకి బాధ్యత తీసుకోవడమే నేను చేయగలిగింది. ఒడిసా రైలు ప్రమాద బాధిత కుటుంబాల పిల్లకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తాను...’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

ఇంతకుముందు పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబాల పిల్లలకు కూడా ఇలాగే ఉచిత విద్య అందిస్తానని మాట ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ దాన్ని నిలబెట్టుకున్నారు.  

  మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీతో పాటు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఈ ఒడిశా రైలు ప్రమాదంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఎవ్వరూ కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు.

అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని, విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా అలాంటి సాయం చేయలేదని సమాచారం.

ఇంతకుముందు కరోనా సమయంలో కూడా మహేంద్ర సింగ్ ధోనీ, కరోనా బాధితుల కోసం రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ధోనీ ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios