Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాపై సూర్యవిరాటం... టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్ సేన...

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు... హాఫ్ సెంచరీలతో రాణించిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్..

Virat Kohli, SuryaKumar Yadav innings helped team India to beat Australia in 3rd T20I
Author
First Published Sep 25, 2022, 10:38 PM IST

హైదరాబాద్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి మూడో టీ20 ఫుల్లు మజాని అందించింది. బౌండరీల వర్షం కురిసిన ఆఖరి నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, 2-1 తేడాతో సిరీస్‌ని సొంతం చేసుకుంది...

187 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 4 బంతుల్లో 1 పరుగు చేసిన కెఎల్ రాహుల్‌ని తొలి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ చేశాడు డానియల్ సామ్స్. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ దశలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ కలిసి మూడో వికెట్‌కి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే, విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు...

27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత స్పీడ్ పెంచిన 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇది 33వ టీ20 హాఫ్ సెంచరీ కాగా ఆస్ట్రేలియాపై 8వ హాఫ్ సెంచరీ. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

శ్రీలంకపై డేవిడ్ వార్నర్ 7 హాఫ్ సెంచరీలు బాది రెండో స్థానంలో ఉన్నాడు. ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. ఛేజింగ్‌లో విరాట్‌కి ఇది 19వ 50+ స్కోరు కాగా, డేవిడ్ వార్నర్ 16, రోహిత్ శర్మ 12 సార్లు ఈ ఫాట్ సాధించారు.

16వ ఓవర్‌లో 5, 17వ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రావడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. అయితే 18వ ఓవర్‌లో 11, 19వ ఓవర్‌లో 10 వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి ఆరోన్ ఫించ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి ఆఖరి 4 బంతుల్లో 5 పరుగులు కావాలి. దినేశ్ కార్తీక్ వస్తూనే సింగిల్ తీయగా ఫోర్ బాదిన హార్ధిక్ పాండ్యా మ్యాచ్‌ని ముగించాడు. 


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్. మొదటి ఓవర్ నుంచి బౌండరీలతో విరుచుకుపడడంతో 3.2 ఓవర్లలో 44 పరుగులకు చేరుకుంది ఆస్ట్రేలియా స్కోరు. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కామెరూన్ గ్రీన్ 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివాదాస్పద రీతిలో రనౌట్ అయ్యాడు...

అక్షర్ పటేల్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. అయితే అప్పటికే బంతిని అందుకునేందుకు ప్రయత్నించిన కీపర్ దినేశ్ కార్తీక్ చేతులను తాకి స్టంప్స్‌ కదిలాయి. అయితే అక్షర్ పటేల్ త్రో నేరుగా వికెట్లను తాకే సమయానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజు చేరుకోకపోవడంతో అతన్ని రనౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

22 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కాగా మాథ్యూ వేడ్ కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన మాథ్యూ వేడ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

17 ఓవర్లు ముగిసే సమయానికి 140 పరుగులే చేసింది ఆస్ట్రేలియా. అయితే భువీ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6,6,4 బాది 21 పరుగులు రాబట్టాడు టిమ్ డేవిడ్. ఆ తర్వాత బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 6,1,6 (మిస్ ఫీల్డ్‌తో ఎక్స్‌ట్రాలు), 1,4 తో 18 పరుగులు రాబట్టారు డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్.

హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున టిమ్ డేవిడ్‌కి ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ. 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే వచ్చింది..

ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ పటేల్, ఆసీస్‌ స్కోరుని 190 దాటకుండా అడ్డుకోగలిగాడు. జస్ప్రిత్ బుమ్రా మొట్టమొదటి సారి టీ20ల్లో 50 పరుగులు సమర్పించుకోగా భువీ తాను వేసిన 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చేశాడు...

Follow Us:
Download App:
  • android
  • ios