Virat Kohli Dance in 2nd ODI: బ్యాట్ తో పాటు ఫీల్డ్ లో కూడా జనాలను ఎంటర్ టైన్ చేయడంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి స్టైలే వేరు.. తాజాగా అతడు...
విరాట్ కోహ్లి మంచి ఎంటర్ టైనర్.. బ్యాట్ తో పరుగుల దాహాన్ని తీర్చడంతో పాటు గ్రౌండ్ లో ఫీల్డ్ చేస్తున్నప్పుడు కూడా అతడు నిత్యం అలర్ట్ గా ఉంటాడు. ఫీల్డ్ లోనే డాన్స్ చేసే కోహ్లి.. తాజాగా వెస్టిండీస్ తో రెండో వన్డేలో కూడా మరోసారి తన డాన్స్ టాలెంట్ ను బయటకు తీశాడు. బుధవారం నాటి మ్యాచులో ప్రమాదకరంగా పరిణమిస్తున్న విండీస్ ఆటగాడు ఓడెన్ స్మిత్ క్యాచ్ అందుకున్నాక కోహ్లి.. డాన్స్ చేశాడు. ఇప్పుడు ఈ స్టెప్పులను.. కొందరు పుష్పలోని ‘శ్రీవల్లి’ స్టెప్పులతో పోలుస్తున్నారు.
రెండో వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. 238 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్.. 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్.. మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్సర్లతో 24 రన్స్ చేసి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
దీంతో భారత జట్టులో కొంత అలజడి మొదలైంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ.. వాషింగ్టన్ సుందర్ కు బంతిని అందించాడు. 45 వ ఓవర్ వేసిన సుందర్.. ఆ ఓవర్లో చివరి బంతిని స్మిత్ ను ఊరించే విధంగా వేశాడు. స్మిత్.. ఆ బంతిని బలంగా బాదాడు. అది గాల్లో పైకి లేచింది. బౌండరీ వద్ద ఉన్న కోహ్లి.. అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డ కోహ్లి తల.. గ్రౌండ్ కు బలంగా తాకింది. అయితే కోహ్లికి పెద్దగా గాయమేమీ కాలేదు.
క్యాచ్ పట్టిన తర్వాత కోహ్లి ఇక తనదైన స్టైల్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు వేసిన స్టెప్పులు.. శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ ను పోలి ఉన్నాయి. దీంతో ట్విట్టర్ వేదికగా పలువురు అభిమానులు.. కోహ్లి శ్రీవల్లి పాటకు డాన్స్ చేశాడని వీడియోలను రూపొందించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. నిన్నటి మ్యాచు లో కోహ్లి మరోసారి విఫలమయ్యాడు. స్వదేశంలో వందో మ్యాచ్ ఆడుతున్న కోహ్లి.. 18 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తొలి వన్డే లో కూడా కోహ్లి.. 8 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఫర్వాలేదనిపించిన కోహ్లి.. విండీస్ తో సిరీస్ లో మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో సీనియర్ భారత క్రికెటర్లు కోహ్లి ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.
