తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన ముకేశ్ కుమార్... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చి హగ్ చేసుకోవడం చాలా స్పెషల్ ఫీలింగ్ అంటూ.. 

దేశవాళీ టోర్నీల్లో బ్యాటుతో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోని సెలక్టర్లు, బౌలర్ ముకేశ్ కుమార్‌ని ఎంపిక చేసి.. రంజీ ట్రోఫీల్లో బాగా ఆడుతున్నవారిని కూడా పట్టించుకుంటున్నామని చెప్పేసుకున్నారు. 2023 రంజీ ట్రోఫీ సీజన్‌లో 5 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ముకేశ్ కుమార్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 10 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు..

దేశవాళీ ప్రదర్శనతో పాటు ఐపీఎల్‌లోనూ మెరవడంతో ముకేశ్ కుమార్‌కి వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్‌ ప్లేస్‌లో రెండో టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు ముకేశ్ కుమార్. తొలి టెస్టులో వికెట్ తీయలేకపోయిన జయ్‌దేవ్ ఉనద్కట్‌కి మరో అవకాశం ఇచ్చిన టీమిండియా, శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో ముకేశ్ కుమార్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది..

Scroll to load tweet…

తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన కిర్క్‌ మెక్‌కెంజీని అవుట్ చేసిన ముకేశ్ కుమార్, 37 పరుగులు చేసిన అలిక్ అతనజేని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన ముకేశ్ కుమార్, 6 మెయిడిన్లతో 48 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

‘రెండో టెస్టులో నేను ఆడబోతున్నానని తెలియగానే షాక్ అయ్యాను. ఎప్పుడెప్పుడు బౌలింగ్ చేస్తానా? అని ఆశగా ఎదురుచూశాను. వికెట్ దక్కగానే విరాట్ భాయ్, రోహిత్ భాయ్ వచ్చి హగ్ చేసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ వాళ్లను టీవీల్లో చూసి విజిల్స్ వేశాను. ఇప్పుడు వాళ్లతో కలిసి ఆడడం, వారితో చేతులు కలపడం చాలా స్పెషల్ ఫీలింగ్..

ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయడానికి నేను సిద్దంగా ఉంటాను. నేను ఆడినా, ఆడకపోయినా బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం ఆపను. బౌలింగ్ మీటింగ్స్‌కీ, టీమ్ మీటింగ్స్‌కీ కచ్ఛితంగా వెళ్తుంటాను, అక్కడ ఎన్నో కొత్త విషయాలు విని తెలుసుకుంటూ ఉంటాను. నాకు అవకాశం వస్తుందని ఎదురుచూశాను..

నాకు టీమ్‌లో అవకాశం రాగానే మొదట మా అమ్మతో ఫోన్‌లో మాట్లాడాను. అది చాలా స్పెషల్ మూమెంట్. నా దేశం తరుపున ఆడబోతున్నానని గర్వంగా చెప్పాను. ఆమె చాలా సంతోషించారు. నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, నా బంధువులు.. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా బౌలర్ ముకేశ్ కుమార్..

2015లో బెంగాల్ తరుపున ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన ముకేశ్ కుమార్, 33 ఫస్ట్ మ్యాచ్ మ్యాచుల్లో 123 వికెట్లు తీశాడు. 23 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసిన ముకేశ్ కుమార్‌కి వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కూడా చోటు దక్కింది.