చంద్రయాన్-3 సక్సెస్‌పై సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపిన భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కో... రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్‌పై నరేంద్ర మోదీ కామెంట్, అసలు విషయం ఏంటంటే.. 

2019లో తృటిలో మిస్ కావడంతో ఫెయిల్ అయిన దాన్ని, 2023లో సక్సెస్ చేసి చూపించింది ఇండియా. క్రికెట్ వరల్డ్ కప్‌‌లో ఇంకా రిజల్ట్ తేలడానికి సమయం ఉంది కానీ నాలుగేళ్ల క్రితం ఫెయిలైన చంద్రయాన్ ప్రయోగం.. 2023 విజయవంతంగా చంద్రుడిని చేరింది. సౌత్ పోల్‌లో ఉపగ్రహాన్ని దించిన మొట్టమొదటి దేశంగా భారత్, ప్రపంచ పటాన సగర్వంగా నిలిచింది. 

చంద్రయాన్-3 సక్సెస్‌పై భారత క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘చంద్రయాన్3 టీమ్‌కి అభినందనలు. మీరు దేశాన్ని గర్వించేలా చేశారు. జై హింద్!’ అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ‘లూనర్ సౌత్ పోల్‌‌కి చేరిన మొట్టమొదటి దేశంగా భారత్‌ నిలిచింది. మనందరికీ ఇది చాలా గర్వకారణమైన మూమెంట్. ఇస్రోకి శుభాకాంక్షలు...’ అంటూ ట్వీట్ చేశాడు..

మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీతో పాటు శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, అజింకా రహానే, మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. ఇలా దాదాపు ప్రతీ క్రికెటర్ కూడా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోకి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు..

Scroll to load tweet…

రవిచంద్రన్ అశ్విన్ చేసిన చంద్రయాన్ ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ‘చరిత్ర సృష్టించాం. అత్యద్భుతాన్ని ఆవిష్కృతం చేసినందుకు ఇస్రోకి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు రవి అశ్విన్. దీనికి నరేంద్ర మోదీ (పేరడీ) అనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి ‘ప్రతీ భారతీయుడికి శుభాకాంక్షలు. అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు ఇస్రోకి థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు..

దీనికి అశ్విన్, నిజంగానే ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడని భావించాడు. ‘సార్, ఎలా ఉన్ానరు? మీరు నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. నాకు ఇది చాలా గొప్ప గౌరవం’ అంటూ రిప్టై ఇచ్చాడు. ఫేక్ అకౌంట్ అని పేరులోనే కనిపిస్తున్నా, వెరిఫికేషన్ టిక్ చూసి.. నిజంగానే ప్రధాని వేసిన ట్వీట్‌గా భ్రమపడి అశ్విన్ స్పందించినట్టు క్లియర్‌గా తెలుస్తోంది.

అశ్విన్, కేవలం ట్విట్టర్‌లోనే కాకుండా ఈ ట్వీట్‌లను స్క్రీన్ షాట్ తీసి, ఇన్‌స్టాలోనూ షేర్ చేశాడు. ‘మంచి రోజు అంతా మంచే జరుగుతుంది..’ అంటూ కాప్షన్ కూడా జోడించాడు. అయితే అది ఫేక్ అకౌంట్ అని తేలడంతో తాను వ్యంగ్యంగా అలా రియాక్ట్ అయినట్టు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

చంద్రయాన్-3 సక్సెస్‌పై వసీం జాఫర్ తన స్టైల్‌లో ఛమత్కరించాడు. ‘చూస్తుంటే ఇది కచ్ఛితంగా బ్యాటింగ్ ఫస్ట్ పిచ్‌లా ఉంది. నేను ముగ్గురు స్పిన్నర్లు, ఓ ఫాస్ట్ బౌలర్‌తో వెళ్తా, ఓ ఆల్‌రౌండర్ కూడా... ఫోటో: చంద్రయాన్ 3’ అంటూ చంద్రయాన్ తీసిన చంద్రుడి ఉపరితలం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.