నీకోసం, నీ ప్రత్యర్థి ఏడిస్తే... రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫోటోపై విరాట్ కోహ్లీ ట్వీట్...
నేను చూసిన అత్యంత అందమైన క్రీడా ఫోటో ఇదే... ఈ ఇద్దరిపైన గౌరవం మరింత పెరిగింది... రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫోటోపై విరాట్ కోహ్లీ రియాక్షన్..
టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ఫేర్‌వెల్ మ్యాచ్ కొన్ని అద్భుత దృశ్యాలకు వేదికగా మారింది. లేవర్ కప్ 2022లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి, ఆత్మీయ స్నేహితుడు స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్‌తో జత కట్టాడు రోజర్ ఫెదరర్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఖరి మ్యాచ్ ఆడుతున్న రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో అనేక మ్యాచులు ఆడిన స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ కూడా ఎమోషనల్ అయ్యి, ఏడ్చేయడం క్రీడా ప్రపంచాన్ని చలించిపోయేలా చేసింది...
ఈ ఫోటోపై భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘ప్రత్యర్థులు కూడా ఇలా ఒకరి మీద మరొకరు ఎమోషన్స్ పెంచుకుంటారా? ఇలా జరుగుతుందని ఎవ్వరైనా అనుకుంటారా అసలు... ఇది ఆటలో ఉన్న అందం. నేను చూసిన అత్యంత అందమైన క్రీడా ఫోటో ఇదే... నీకోసం నీ ప్రత్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటే, అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. దేవుడిచ్చిన టాలెంట్‌తో నువ్వేం చేయగలవో ప్రత్యేకంగా చెప్పాలా... వీళ్లిద్దరిపైన గౌరవం మరింత పెరిగింది...’ అంటూ రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఎమోషనల్ అయిన ఫోటోను ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...
రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ప్రత్యర్థులు మాత్రమే కాదు, ఒకరంటే మరొకరికి అభిమనం ఉన్న స్నేహితులు. ఈ ఇద్దరూ 40 సార్లు తలబడగా 24 సార్లు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, ఫెదరర్‌పై విజయం సాధించాడు. 16 సార్లు నాదల్‌ని ఓడించాడు రోజర్ ఫెదరర్... హోరాహోరీగా తలబడే ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య మ్యాచ్‌ని టెన్నిస్ ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా వీక్షించేది. ఫెదరర్ ఆఖరి మ్యాచ్‌లో కూడా రఫెల్ నాదల్ ప్రత్యర్థిగా ఉంటాడని, ఉంటే బాగుంటుందని భావించారు టెన్నిస్ ఫ్యాన్స్. అయితే రోజర్ మాత్రం రఫెల్ నాదల్‌తో కలిసి ఆడేందుకే ఇష్టపడ్డాడు..
24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలిన రోజర్ ఫెదరర్, కన్నీటితో తన కెరీర్‌కి ముగింపు పలికాడు... ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 310 వారాల పాటు అగ్ర స్థానాన నిలిచిన రోజర్ ఫెదరర్, 237 వారాల పాటు ఏక ధాటిగా టాప్ పొజిషన్‌ని ఏలాడు.
24 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో 103 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రోజర్ ఫెదరర్, 8 సార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు.