ఆసిస్ తో ఇటీవల స్వదేశంలో ముగిసిన వన్డే సీరిస్‌‌ను వరుస ఓటములతోె టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆరంభం భాగానే వున్నా చివరి రెండు వన్డేల్లో ధోని జట్టుకు దూరమవడం వల్లే భారత్ ఓటమిపాలయ్యిందని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ  ఆరోపణతో టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఏకీభవించారు. 

భారత జట్టుకు అధికారికంగా కోహ్లీ సారథి అయినప్పటికి మైదానంలో మాత్రం ఆటగాళ్లను ముందుండి నడిపిస్తున్నది మాజీ కెప్టెన్ ధోనినే. ఇలా ధోనిపై కోహ్లీ అతిగా ఆధారపడుతున్నాడన్నవిషయం అందరికి తెలిసిందే.  దీంతో ధోని జట్టుకు దూరమైన మ్యాచుల్లో కోహ్లీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని... టీమిండియా ఓటములకు అదీ ఓ కారణమవుతోందని మాజీ కోచ్, ఆటగాడు అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. 

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సీరిస్ మొదట టీమిండియా  విజయవంతంగానే ఆరంభించిందని కుంబ్లే అన్నారు. ఆ సమయంలో ఫీల్డింగ్,బౌలింగ్ తదితర విషయాల్లో కోహ్లీ ధోని సాయాన్ని తీసుకున్నాడు. దీంతో భారత్ వరుస విజయాలను అందుకుంది. అయితే చివరి రెండు వన్డేల్లో ధోనికి విశ్రాంతినివ్వడం భారత విజయావకాశాలను దెబ్బ తీసిందని కుంబ్లే పేర్కొన్నారు. 

''ప్రస్తుతం భారత జట్టులో సుధీర్ఘ అనుభమున్నఏకైక ఆటగాడు ధోని.  ఆటగాడిగానే కాకుండా వికెట్ కీఫర్, కెప్టెన్ గా కూడా అతడికి మంచి అనుభవముంది. కాబట్టి ఏ సమయంలో ఎలాంటి బౌలర్లను ఉపయోగించాలి...ఎవరు ఎలా బౌలింగ్ చేస్తారన్న విషయాలు అతడికి బాగా తెలుసు. అతడు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నా ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ కి ఈ విషయాల్లో సాయం చేస్తున్నాడు. ఇలా ధోనిపై కోహ్లీ విఫరీతంగా ఆధారపడుతున్నాడు.'' అని కుంబ్లే తెలిపారు.

ఇలాంటి సీనియర్ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడంతో చివరి రెండు వన్డేల్లో కోహ్లీ పై తీవ్ర ఒత్తిడి పెరిగిందని...ఆ అసహనం వివిధ సందర్భాల్లో బయటపడిందని గుర్తుచేశారు. దీంతో ధోని ఎంత విలువైన ఆటగాడో కోహ్లీకి తెలిసివచ్చిందన్నారు. ప్రపంచ కప్ టోర్నీలో కూడా ధోని భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగనున్నాడని కుంబ్లే తెలిపాడు.