క్రైస్ట్ చర్చ్: టీమిండియా యాజమాన్యం యువ పేసర్లపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వయస్సు మీరుతున్న స్టార్ పేసర్ల నుంచి ఎక్కువగా ఆశించలేమని ఆయన అన్నాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సు గల జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని ముందుకు నడిపించగలడని ఆయన అన్నారు. 

ఇశాంత్ శర్మ (32), మొహమ్మద్ షమీ (29), ఉమేష్ యాదవ్ (33) సేవలు మరెంతో కాలం అందుబాటులో ఉండకపోవచ్చునని, ఈ సీనియర్లకు తోడుగా యువ పేసర్లు ఎవరూ లేరని ఆయన అన్నారు. వారి స్థానాలను భర్తీ చేయగల యువ ఫాస్ట్ బౌలర్లు జట్టుకు అవసరమని ఆయన అన్నాడు. వారిని సాధ్యమైనంత త్వరలో సిద్ధం చేయాలని ఆయన అన్నాడు. 

ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా బౌలింగ్ చేయగల ముగ్గురు నలుగురు యువ పేసర్లను గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నాడు. సీనియర్లు అందుబాటులో లేనప్పుడు లోటు కనిపించకూడదని ఆయన అన్నాడు.

క్రికెట్ లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉం్టాయని, అందరికీ దానిపై అవగాహన ఉండాలని, ఒక్కరిపైనే ఆధారపడలేమని, సీనియర్లకు బ్యాకప్ లేదని, సైనీ ఇప్పటికే వ్యవస్థలోకి వచ్చాడని, మరో ఇద్దరిపై తాము దృష్టి పెట్టాల్సి ఉంటుందని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రమాణాలు తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. 

ఉమేష్, ఇషాంత్, షమీ చాలా కాలంగా సేవలందిస్తూ వస్తున్నారని, వారి స్థానాలను భర్తీ చేసే యువకులను గుర్తించి భర్తీ చేయాలని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ యువకుల పేర్లు చెప్పనప్పటికీ టీమిండియా యాజమాన్యం హైదరాబాదు నుంచి మహ్మద్ సిరాజ్, కేరళ నుంచి సందీప్ వారియర్, మధ్య ప్రదేశ్ నుంచి ఆవేశ్ ఖాన్, బెంగాల్ నుంచి ఇషాన్ పొరేల్ లపై దృష్టి సారించినట్లు భావిస్తున్నారు.