Virat kohli: భారత్ లో నమ్మకాలు ఎక్కువ. ఈ  పని చేస్తే పుణ్యం దక్కుతుందంటే  దాని కోసం ఖర్చుకు సైతం వెనకాడకుండా  చేసేవాళ్లు కోట్లలో ఉంటారు. తాజాగా కోహ్లీ ఫ్యాన్ కూడా అదే పని చేస్తోంది.

విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేస్తాడా..? చెయ్యడా..? అసలు ఇప్పట్లో కోహ్లీ ఫామ్ లోకి వస్తాడా..? రాడా..? అన్నసంగతి దేవుడెరుగు. ఆటలో ఎత్తుపల్లాలు సహజమని.. ఎంత గొప్ప ఆటగాడికైనా కెరీర్ లో ఇలాంటి దశ తప్పదని అభిప్రాయాలు వినిపిస్తున్నా అతడి అభిమానులు మాత్రం కోహ్లీ మీద అచంచల విశ్వాసంతో ఉన్నారు. గడిచిన మూడేండ్లుగా సగర్వంగా బ్యాట్ పైకెత్తలేని కోహ్లీ పై అతడి అభిమానులు ఆశలు కోల్పోలేదు. ‘కష్టకాలం వెళ్లిపోక తప్పదు’ అని ఆదర్శ సూత్రాలు వల్లె వేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం నీతి సూత్రాలు చెప్పడం కాదు.. కోహ్లీ ఫామ్ లోకి రావాలని మళ్లీ అతడు మునపటి ఆట ఆడాలని ఓ పుణ్యకార్యం చేస్తున్నది. 

కోహ్లీ వీరాభిమాని అయిన ఓ మహిళ.. అతడి పేరు మీద ఆహార పొట్లాలను అందజేస్తున్నది. కోహ్లీ ఎలాగైనా సెంచరీ కొట్టాలని గత కొద్దిరోజులుగా ఆకలితో అలమటించేవారికి అన్నం పెడుతున్నది.

ట్విటర్ లో ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన విషయాన్ని షేర్ చేశాడు. దీని ప్రకారం.. సదరు మహిళ కోహ్లీకి వీరాభిమాని (ఆమె పేరు, వివరాలు వెల్లడించలేదు). అయితే అతడు ఫామ్ కోల్పోయి అందరితో మాటలు పడుతుంటే ఆమె మనసు విలవిల్లాడింది. వంద ఇన్నింగ్స్ కు పైగా సెంచరీ కొట్టలేక చతికిలపడుతున్న కోహ్లీకి పుణ్యం దక్కాలని ఆమె ప్రయత్నిస్తున్నది. ఆ మేరకు ఆకలితో అలమటించేవారికి ఆహార పొట్లాలను పంచి పెడుతున్నది. ఆ పొట్లాల మీద ‘కోహ్లీ 71వ సెంచరీ కోసం’ అని రాసి ఉండటం గమనార్హం.

Scroll to load tweet…

తాను పుణ్యం చేస్తేనైనా ఆ పుణ్యఫలం కోహ్లికి అంది తద్వారా అతడు మళ్లీ మునపటి కోహ్లీలా అదరగొడతాడని సదరు మహిళ విశ్వాసం. అందులో భాగంగానే రోడ్లమీద ఉంటూ ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ఆహార పొట్లాలను పంచుతున్నది. మరి ఈ పుణ్యం కోహ్లీకి దక్కి వచ్చే మ్యాచుల్లో అయినా అతడు సెంచరీ చేయాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. 

కోహ్లీ పుణ్య ఫలం సంగతి పక్కనబెడితే ఈ మహిళ చేస్తున్న పని మాత్రం అభినందనీయం. నిరాశ్రయులై కట్టుకోవడానికి సరైన బట్టలు లేక ఆకలికి అలమటించేవారికి సాయం చేయడం ఆమె మానవతా హృదయానికి నిదర్శనమని అంటున్నారు నెటిజన్లు. ఆమె ఆరాటం చూసైనా కోహ్లీ సెంచరీ చేయాలని ఆశిస్తున్నారు.