India Vs Srilanka 2nd Test సాధారణంగా అభిమానులు క్రికెట్ స్టేడియానికి వచ్చేది క్రికెటర్లను ఉత్సాహపరచడానికి.. కానీ కోహ్లి విషయంలో ఇది కొంచెం రివర్స్. ఎందుకంటే అతడే ఓ పెద్ద ఎంటర్టైనర్..
‘ఊరికే తిని తొంగొంటే మనిసికి గొడ్డుకు తేడా ఏటుంటాది..? మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాలి..’ అంటాడు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు. ఈ సూత్రాన్ని నరనరాన ఒంటబట్టించుకున్నాడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. గ్రౌండ్ లో తన ఆట కోసం వచ్చిన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో అతడూ ఎప్పుడూ వెనక్కి తగ్గడు. మిగతా క్రికెటర్ల మాదిరి వచ్చామా.. నాలుగు పరుగులు చేశామా.. వెళ్లమా..? అన్నట్టు ఉండదు కోహ్లి వైఖరి. ఓవైపు బ్యాట్ తో పరుగుల వరద పారిస్తూనే.. మరోవైపు తన దూకుడు, హావబావాలతో అభిమానులను అలరిస్తాడు. ఈ వైఖరే అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
గ్రౌండ్ లో ఆటను చూడటానికి వచ్చే అభిమానులు సాధారణంగా ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడానికి వస్తారు. కానీ కోహ్లి వంటి ఆటగాడు మాత్రం అభిమానులనే ఉత్సాహ పరుస్తాడు. తాజాగా అతడు బెంగళూరు టెస్టులో తన మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ తో పాటు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాలను ఇమిటేట్ చేసి అభిమానులకు ఫన్ ను పంచాడు.
రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా.. కోహ్లి బుమ్రా బౌలింగ్ స్టైల్ ను అనుకరించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు తక్కువ స్కోరు (252) కే ఆలౌట్ అయిన అనంతరం లంక బ్యాటింగ్ కు వచ్చింది. ఈ క్రమంలో కోహ్లి బుమ్రా బౌలింగ్ ఆక్షన్ ను ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక కొద్దసేపటికి స్టేడియానికి వచ్చిన అబిమానులంతా ‘ఏబీడీ.. ఏబీడీ’ అంటూ మిస్టర్ 360 పేరును గట్టిగా అరుస్తుండగా కోహ్లి వాళ్ల వైపు తిరిగి.. డివిలియర్స్ లా స్విచ్ షాట్ ను కొట్టినట్టు ఇమిటేట్ చేశాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
కోహ్లి-డివిలియర్స్ లు కలిసి చాలాకాలం పాటు ఆర్సీబీ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి ఆడిన ఎన్నో ఇన్నింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు. గత సీజన్ అనంతరం ఏబీడీ.. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లి-డివిలియర్స్ మధ్య ఆటగాళ్ల కంటే అంతకుమించిన అనుబంధం ఉంది. ఇద్దరూ ఒకరినొకరు సోదరుల వలే భావిస్తారు. వీళ్ల బాండింగ్ కు కూడా ఐపీఎల్ లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
