క్రికెట్ మధ్య దొరికే కొద్దిపాటి బ్రేక్ ని ఎంజాయ్ చేయడంలో కోహ్లీ ముందుంటాడు. శ్రీలంకతో మరో వారం రోజుల్లో టి 20 సిరీస్ ప్రారంభమవనున్న నేపథ్యంలో... విండీస్ సిరీస్ అనంతరం హాలిడే మోడ్ లోకి వెళ్ళింది విరుష్క జంట. చలికాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది ఈ జంట. 

2019లో చాలా రికార్డులను అత్యంత సునాయాసంగా బద్దలు కొట్టిన కోహ్లీ ఇయర్ ఎండ్ ని మాత్రం చల్లచల్లగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నట్టున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ఒక మంచుకొండ మీద ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసాడు కోహ్లీ. ప్లేస్ ఎక్కడనేది మాత్రం రివీల్ చేయలేదు. ఏముంది... ఆ ఫోటోను చూసి ఫిదా అయిపోయిన అభిమానులు... ఈ జంటపై తమ ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. 

ఈ డిసెంబరులోనే తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ జంట, ఆ స్పెషల్ డే సందర్భంగా భూటాన్ లో పర్యటించారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని ఆ దేశంలో చాలా ప్రశాంతత మధ్య చేసుకున్నట్టు కోహ్లీ వివరించాడు. 

2020లో భారత జట్టు షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. వచ్చే జనవరి మొదటి వారంలో శ్రీలంకతో టి 20 సిరీస్ ముగియగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాలి. అది పూర్తవగానే న్యూజిలాండ్ పర్యటన. ఈ సంవత్సరంలోనే టి 20 వరల్డ్ కప్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ ఎలాగో ఉండనే ఉంది. 

సో మొత్తానికి అభిమానులకు మాత్రం ఈ సంవత్సరం బోలెడంత క్రికెట్ ఉత్కంఠ ఖాయంగా కనపడుతుంది.