RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన ఆర్సీబీ, తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. కోహ్లీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేల్, డివిలియర్స్‌తో కలిసి గ్రౌండ్ లో గెలుపు సంబరాలు చేసుకున్నాడు.
Virat Kohli emotional after RCB wins IPL: ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ హోరాహోరీ పోరులో గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసే లోపే కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రజత్ పాటిదార్ 26, లియామ్ లివింగ్‌స్టోన్ 25, మయంక్ అగర్వాల్ 24, జితేష్ శర్మ 24, రొమారియో షెఫర్డ్ 17, ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు చేశారు. పంజాబ్ తరపున అర్షదీప్ సింగ్, కైల్ జేమిసన్ తలా మూడు వికెట్లు తీసారు.
లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌కు 30 పరుగుల అవసరం ఉండగా, జోష్ హేజిల్‌వుడ్ తొలి రెండు బంతుల్లో శశాంక్ సింగ్‌ను పరుగులు చేయనీయకుండా అడ్డుకోవడంతో ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. జోష్ ఇంగ్లిష్ 39, ప్రభ్ సిమ్రన్ సింగ్ 26, ప్రియాంశ్ ఆర్య 24 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, పాండ్య తలా రెండు వికెట్లు తీసారు.
గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ వీడియో
మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ మైదానంలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కోహ్లీని హత్తుకుని సహచరులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ ఆర్సీబీ మాజీ ఆటగాళ్లైన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ల వద్దకు వెళ్లి వారిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. డివిలియర్స్, గేల్ రెండొందల ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, టైటిల్ గెలవలేకపోయారు. వారి సమక్షంలో ఆర్‌సీబీ విజయం సాధించడం, కోహ్లీకి ప్రత్యేకమైన క్షణంగా నిలిచింది.
ఈ విజయం ద్వారా ఆర్‌సీబీ 17 సంవత్సరాల ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. విరాట్ కోహ్లీ 2008 నుంచి ఆర్సీబీతోనే ఆడుతున్నాడు. అనేక సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయాడు. ఇప్పుడు ఆ కల నెరవేరడంతో ఆర్డీబీ జట్టుతో పాటు కోహ్లీకి ఇది ఓ చారిత్రక క్షణంగా నిలిచింది. జట్టుతో పాటు ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి.
