Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తన ప్రయాణం, కెప్టెన్సీ వీడడం వెనుక కారణాలను విరాట్ కోహ్లీ వెల్లడించారు. ఇతర జట్లలో చేరే అవకాశాలు ఉన్నప్పటికీ, అభిమానుల ప్రేమ, జట్టుతో ఉన్న అనుబంధమే ముఖ్యమని కింగ్ కోహ్లీ అన్నాడు. 

Virat Kohli IPL RCB: విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఉన్న అపారమైన అభిమానాన్ని, అలాగే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కారణాలను తాజాగా విడుదలైన RCB పోడ్‌కాస్ట్ లో వెల్లడించాడు. ఈ పోడ్‌కాస్ట్‌ను RCB యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేసింది. 

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లలో 8933 పరుగులు సాధించి జట్టు ఆల్‌టైమ్ టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు. అతని సగటు 39.52 కాగా, 8 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. 

ఆర్సీబీ జట్టు పై విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే? 

"నా కెరీర్‌లో అత్యుత్తమ సంవత్సరాలు అయిన 2016 నుండి 2019 మధ్యకాలంలో ఇతర జట్లకు వెళ్లేందుకు అవకాశాలు వచ్చాయి. కానీ, ఆర్సీబీతో ఏర్పడిన సంబంధం, పరస్పర గౌరవం, ముఖ్యంగా అభిమానుల ప్రేమ వల్ల నేను ఇక్కడే ఉన్నాను. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ లోనే కొనసాగుతున్నాను" అని కోహ్లీ వివరించారు.

విరాట్ ఇంకా మాట్లాడుతూ, "ఇతర జట్టుకు వెళ్లాలా? లేక ఈ జట్టుతోనే కొనసాగాలా? అని అనేకసార్లు ఆలోచించాను. కానీ చివరికి, ఇది నా ప్రయాణం, అభిమానుల ప్రేమతో సమానమైన ట్రోఫీ ఏదీ ఉండదు" అని కింగ్ కోహ్లీ అన్నాడు.

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఎందుకు తప్పుకున్నాడు? 

విరాట్ 2021లో ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఎందుకు ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నారనే ప్రశ్నలపై కోహ్లీ స్పందిస్తూ.. "ఇండియా, RCB రెండింటినీ ఒకేసారి నడిపించడంలో ఒత్తిడితో నాకెంతో కష్టంగా మారింది. ప్రతీ రోజు ప్రశ్నలు, అంచనాలు, విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇక నేను ఆనందంగా ఉండాలని, ఒత్తిడి లేకుండా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నాను" అని చెప్పాడు.

IPL 2025 లో అదరగొడుతున్న కింగ్ కోహ్లీ 

IPL 2025లో ఇప్పటివరకు విరాట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 11 మ్యాచ్‌లలో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 73* పరుగులు కాగా, సగటు 63.12, స్ట్రైక్ రేట్ 143.46గా ఉంది. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో ఉంది. మే 9న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తన తర్వాతి మ్యాచ్ ను ఆర్సీబీ ఆడనుంది.