సారాంశం
Vijay Deverakonda vs Tilak Varma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) vs గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్‌కు ముందు ఇద్దరు తెలుగు స్టార్లు తిలక్ వర్మ, విజయ్ దేవరకొండలు పికిల్‌బాల్ ఆడారు. ఇదే క్రమంలో తిలక్ కు విజయ్ దేవరకొండ ఒక సవాల్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Vijay Deverakonda wins pickleball match vs Tilak Varma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సవాల్ చేశాడు. వీరిద్దరూ కలిసి పికిల్‌బాల్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సరదా గేమ్‌లో విజయ్ దేవరకొండ జట్టు 2-1 తేడాతో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ విజయాల్లో తిలక్ వర్మ ముఖ్యపాత్ర పోషించాడు. కానీ విజయ్ దేవరకొండతో ఆడిన సరదా గేమ్‌లో మాత్రం తిలక్ జట్టు ఓడిపోయింది.
గేమ్‌కు ముందే విజయ్ దేవరకొండ సరదాగా మాట్లాడుతూ.. “నువ్వు నన్ను ఓడిస్తే నేను ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకుంటాను” అని సవాల్ విసిరాడు. విజయ్ జట్టే గెలవడంతో గెలుపు తర్వాత ఒక ప్రత్యేక రివార్డ్ కోరాడు. అదే.. కింగ్ డమ్ సినిమాలోని 'హృదయం లోపల' పాటకు డ్యాన్స్ రీల్ చేయాలన్నాడు. దానికి తిలక్ వర్మనే కొరియోగ్రాఫ్ చేయాలన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. మరి తిలక్ వర్మ డాన్స్ రీల్ చేస్తాడో లేదో చూడాలి మరి.. !