Asianet News TeluguAsianet News Telugu

రోహిత్‌ శర్మకి బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియాతో టెస్టుకి ముందు అరుదైన దృశ్యం...

India vs Australia: నాగ్‌పూర్ టెస్టు టాస్‌కి ముందు రోహిత్ శర్మకి బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Virat Kohli bowling to Rohit Sharma before nagpur test, India vs Australia cra
Author
First Published Feb 9, 2023, 1:34 PM IST

టీమిండియాకి ఇద్దరు పిల్లర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ఇద్దరి మధ్య ఇగోలు, మనస్పర్థలు ఉన్నాయనే వార్త ఎప్పటినుంచే వినిపిస్తూనే ఉంది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరు ఎంతో సఖ్యంగా కనిపిస్తున్నారు..

ఆసియా కప్ 2022 నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మంచి రాపో కనిపిస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి గెలిచిన తర్వాత అతన్ని కౌగిలించుకుని, ఎత్తుకున్నాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరి మధ్య ఇలాంటి మూమెంట్స్ చూసి టీమిండియా ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు..

తాజాగా నాగ్‌పూర్ టెస్టు ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం కనిపించింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చూసి ఉండొచ్చు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్‌కి బౌలింగ్ చేయడం ఎప్పుడూ చూసి ఉండరు అభిమానులు...

నాగ్‌పూర్ టెస్టు టాస్ సమయానికి ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే, విరాట్ కోహ్లీ అతనికి బంతులు వేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు చాలా కీలకంగా మారింది...

అంతర్జాతీయ క్రికెట్‌లో 24,936 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో 64 పరుగులు చేస్తే, అత్యంత వేగంగా 25 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మరోవైపు టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది అసలైన ఛాలెంజ్ కానుంది.. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడాన్ని బట్టి చూస్తే, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని టీమిండియా భావించినట్టు తెలుస్తోంది..

 

అయితే టాస్ ఓడిన భారత జట్టు, ఆసీస్‌పై పట్టు సాధించే దిశగా సాగుతోంది. రెండో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ మొదటి బంతికే ఉస్మాన్ ఖవాజాని, రెండో ఓవర్ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ని షమీ అవుట్ చేయడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ సమయంలో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో విరాట్ కోహ్లీ జారవిడిచారు.

విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసిన సమయంలో స్టీవ్ స్మిత్ 26 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. లబుషన్‌తో కలిసి మూడో వికెట్‌కి 82 పరుగులు జోడించాడు స్టీవ్ స్మిత్. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. లబుషేన్‌ని స్టంపౌట్ చేసిన  రవీంద్ర జడేజా వెంటవెంటనే 3 వికెట్లు తీయడంతో 109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆసీస్...

మార్నస్ లబుషేన్‌తో పాటు డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు రవీంద్ర జడేజా. అయితే పీటర్ హ్యాండ్స్‌కోంబ్, ఆలెక్స్ క్యారీ కలిసి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుకు 150 పరుగులు దాటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios