టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రికార్డులు సృష్టించడం... లేదా... ఇతర క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డులను తన పేరిట లిఖించుకోవడం కొత్తేమీకాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డులను కోహ్లీ కొల్లగొడుతూనే ఉన్నాడు. పరుగుల రారాజుగా పేరొందిన కోహ్లీ తాజాగా తన పేరిట మరో సంచలనం సృష్టించాడు.

టీమిండియా కెప్టెన్ గా మాత్రమే కాకుండా.. ఫిట్ నెస్ విషయంలో కూడా కోహ్లీ ఎందరికో ఆదర్శం. తన లేటెస్ట్ ఫోటోలు, ఫిటెన్నెస్ కి సంబంధించిన విషయాలు, తన స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... అభిమానులకు అందుబాటులో ఉంటూ ఉంటాడు. తన భార్య అనుష్క శర్మ తో కలిసి దిగిన ఫోటోలు, వెళ్లిన ట్రిప్ లకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తూ ఉంటాడు. వీరి ఫోటోలకు మిలియన్లలో లైకులు వస్తూ ఉంటాయి.

ఈ సంగతి పక్కన పెడితే... తాజాగా విరాట్... సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న తొలి ఇండియన్ రికార్డులకెక్కాడు. 

Also Read టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్: దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్...

ఇప్పటివరకు తన ఇన్‌స్టా ఖాతాలో కేవలం 930 పోస్టులు మాత్రమే చేశాడు కోహ్లీ.  కానీ అతని ఆటతీరుకి ఉన్న క్రేజ్ కారణంగా ఫాలోవర్స్ ని మాత్రం బాగానే రాబట్టాడు. ఎంతలా అంటే.. మన దేశంలోనే అంత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఏకైన వ్యక్తి గా నిలిచాడు. మరే సినీ సెలబ్రెటీ కూడా ఆ రికార్డు చేరుకోకపోవడం గమనార్హం. 

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 49.9 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఇండియాలో రెండో స్థానాన్ని ఆక్రమించగా..44.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో మరో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 3వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డ్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి ఇన్‌స్టా ఖాతాకి ఏకంగా 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.