టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. వీరిద్దరూ వృత్తిపరంగా నిత్యం బిజీగా ఉంటారు. వాళ్లు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరిగే విషయాలపై, ప్రజల సమస్యలపై సైతం ఈ జోడి స్పందిస్తూ ఉంటారు. 

 

తాజాగా అనుష్క శర్మ బిహార్‌, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. తాము కూడా వరద బాధితులకు సాయం చేస్తున్న ఆర్గనైజేషన్స్‌కు తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. రాపిడ్‌ రెస్పాన్స్‌, యాక్షన్‌ ఎయిడ్‌, గూంజ్‌ ఈ మూడింటి ద్వారా బిహార్‌, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేస్తున్నామని చెప్పారు. 

దీనికి  సంబంధించి ఒక పోస్ట్‌ను అనుష్క తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ మూడు స్వచ్చంధ సంస్థల లింక్‌లను కూడా షేర్‌ చేశారు. సాయం చేయాలనుకున్న వారు వీటి ద్వారా విరాళాలు అందించవచ్చని తెలిపారు. ‘కరోనాతో దేశం అల్లాడిపోతుంటే మరోవైపు బిహార్‌, అ‍స్సాం ప్రజలు వరదలలో చిక్కుకుకొని విలవిలలాడుతున్నారు. మూడు ఆర్గనైజేషన్‌లు వారికి సహాయచర్యలు అందిస్తున్నాయి. మేం వారికి అండగా ఉంటున్నాం. మీరు కూడా  ఈ సంస్థల ద్వారా సాయాన్ని అందించండి’ అని సోషల్‌మీడియా వేదికగా కోరారు.