Asianet News TeluguAsianet News Telugu

ఆర్‌సీబీ ఓనర్‌తో క్రిస్ గేల్ ‘సూపర్ ఫ్రెండ్‌షిప్’... విజయ్ మాల్యాతో ఫోటో షేర్ చేసిన యూనివర్సల్ బాస్...

ఐపీఎల్ 2022 మెగా సీజన్‌కి దూరంగా ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్... క్రిస్ గేల్‌తో తనకి అప్పటి నుంచే సూపర్ ఫ్రెండ్‌షిప్ ఉందంటున్న విజయ్ మాల్యా...

Vijay Mallya Shares pic with Universal boss Chris Gayle, captions Super Friendship
Author
India, First Published Jun 22, 2022, 3:56 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పాల్గొనలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ రావడానికి కారణమైన వారిలో ఒకడైన క్రిస్ గేల్, ఈ సీజన్‌ మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోలేదు.. గేల్ రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వచ్చినా, వచ్చే సీజన్‌లో తాను ఐపీఎల్‌ ఆడతానని కామెంట్ చేశాడు ఈ విండీస్ దిగ్గజం...

తాజాగా ఆర్‌సీబీ యజమాని, బిజినెస్‌మ్యాన్ విజయ్ మాల్యాని కలిశాడు క్రిస్ గేల్.  భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, క్రికెట్‌పై ప్రేమను మాత్రం చాటుకుంటూనే ఉన్నాడు. గత ఏడాది ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచులు చూసేందుకు స్టేడియానికి వచ్చిన విజయ్ మాల్యా, క్రిస్ గేల్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...

‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ది యూనివర్సల్ బాస్, ఆర్‌సీబీలో ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య సూపర్ ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది... బాగా సంపాదించిన ప్లేయర్లలో ఒకడు... గొప్ప ప్లేయర్... ’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ మాల్యా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనకపోయినా ఐపీఎల్ 2023 సీజన్‌లో రీఎంట్రీ ఇస్తానని ప్రకటించిన క్రిస్ గేల్, తాను ఇంతకుముందు ఆడిన ఆర్‌సీబీ లేదా పంజాబ్ కింగ్స్ జట్ల తరుపున ఆడి టైటిల్ గెలిపిస్తానని కామెంట్ చేశాడు. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి వచ్చిన క్రిస్ గేల్, ఆ ఫ్రాంఛైజీ తరుపున 91 మ్యాచులు ఆడి 43.29 సగటుతో 154.40 స్ట్రైయిక్ రేటుతో 3450 పరుగులు చేశాడు...

ఇందులో 5 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరుపున క్రిస్ గేల్ చేసిన 175 పరుగుల స్కోరు, ఐపీఎల్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అయితే 2017 సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత క్రిస్ గేల్‌ని వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ...

2018 నుంచి 2021 వరకూ పంజాబ్ కింగ్స్‌కి ఆడిన క్రిస్ గేల్, 2022 సీజన్‌లో మెగా వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు. ‘కొన్నాళ్లుగా ఐపీఎల్‌లో నాకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అనిపించింది. అందుకే కొన్ని రోజులు క్రికెట్‌కి దూరంగా ఉండాలని అనుకున్నా. ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలు నన్ను గౌరవించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ రెండు ఫ్రాంఛైజీల్లో ఏదో ఒకదాని తరుపున ఆడి టైటిల్ అందివ్వాలని అనుకుంటున్నా...’ అంటూ కొన్ని రోజుల కిందట కామెంట్ చేశాడు క్రిస్ గేల్...

మరోవైపు లిక్కర్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మాల్యా, యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్‌కి ఛైర్మెన్‌గా ఉన్నాడు. భారత్‌లోని 17 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న విజయ్ మాల్యా, ఆర్థిక నేర ఆరోపణలు వచ్చిన తర్వాత లండన్‌కి పారిపోయాడు...

విజయ్ మాల్యాని స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే యథేచ్ఛగా క్రికెట్ స్టేడియాలకు, క్లబులకు వెళ్తున్న విజయ్ మాల్యాని భారత్‌కి రప్పించడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందనేది సామాన్య జనాలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది... 

Follow Us:
Download App:
  • android
  • ios