అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవలే గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. రిటైర్మెంట్ సమయంలోనే తాను అంతర్జాతీయ  క్రికెట్ కు మాత్రమే గుడ్ బై చెబుతున్నట్లు క్లియర్ గా ప్రకటించిన యువీ విదేశీ క్రికెట్ లీగుల్లో మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు. అందుకు తగ్గట్లుగానే ఈ నెల 25వ తేదీన కెనడా వేదికగా మొదలయ్యే గ్లోబల్ టీ20 లీగ్ లీగ్ మరోసారి బ్యాట్ పట్టడానికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఈ లీగ్ నిర్వహకులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

ఇప్పటికే ఈ లీగ్ లో పాల్గొనడానికి యువీ బిసిసిఐ అనుమతి కోరాడు. అయితే బిసిసిఐ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ లీగ్ ఆడేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో యువీ టోరంటో నేషనల్స్ జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకుని ఈ మేరకు జట్టు యాజమాన్యంతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీంతో యువీ తన క్రికెట్ కెరీర్లోని మొదటి ఇన్నింగ్స్ ను ఇండియాలో మొదలుపెట్టగా సెంకండ్ ఇన్నింగ్స్ ను మాత్రం కెనడా నుండి మొదలుపెట్టనున్నాడు. 

అయితే యువరాజ్ కేవలం విదేశీ లీగులు మాత్రమే ఆడతానని రిటైర్మెంట్ సమయంలో స్పష్టంగా ప్రకటించాడు. కాబట్టి ఐపిఎల్ లో కూడా ఆడే అవకాశాలు లేవన్నమాట. దీంతో స్వదేశంలో అతడు బ్యాట్ పట్టుకునే అవకాశం  రాకున్నా విదేశాలకు వెళ్లి ఆ సరదాను తీర్చుకుంటున్నాడు. యువరాజ్ తో గ్లొబల్ టీ20 లీగ్ లో ఆడటం ద్వారా ఇండియాలో తమకు మంచి ప్రచారం లభిస్తుందని ఆ లీగ్ నిర్వహకులు భావిస్తున్నారు. అందువల్లే అతడిని ఆడించేందకు కావాల్సిన అన్ని అనుమతులను అతి తక్కువ సమయంలో అందించి సహకరించారు.