టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇటీవల ముగిసిన వెస్టిండిస్ పర్యటనలో వికెట్ కీపర్ గానే కాకుండా బ్యాట్స్ మెన్ కూడా అతడు ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి.  ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా పంత్ పేలవ ప్రదర్శనపై స్పందించాడు. 

'పంత్ మంచి ప్రతిభగల ఆటగాడే. కానీ అతడికి మరో యువ సంచలనం సంజూ శాంసన్ తో ప్రమాదం పొంచివుంది. ఈ కేరళ కుర్రాడు అటు బ్యాటింగ్ ఇటు వికెట్ కీపింగ్ లోనూ అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. ఒకవేళ పంత్ జట్టులో స్ధానం కోల్పోతే దాన్ని తప్పకుండా శాంసనే భర్తీ చేస్తాడు.   

ప్రస్తుతం భారత జట్టు యువ క్రికెటర్లతో కలకలలాడుతోంది. సెలెక్టర్లు కూడా వారికి మంచి అవకాశాలనిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలా అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, మనీశ్  పాండే లు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. వీరితో మరికొంత మంది కూడా సత్తా చాటేందుకు సిద్దంగా వున్నారు. టీ20 ప్రపంచ కప్ నాటికి భారత జట్టులోకి మరికొంత మంది యువ క్రికెటర్లు చేరే అవకాశముంది.'' అని గంభీర్ పేర్కొన్నాడు. 

వెస్టిండిస్ పర్యటనకు ధోని దూరమవడంతో వచ్చిన అరుదైన అవకాశాన్ని పంత్ ఉపయోగించుకోలేకపోయాడు. కరీబియన్ గడ్డపై జరిగిన మూడు ఫార్మాట్లలోనూ పూర్తిస్థాయి వికెట్ కీపర్ గా ఆడినప్పటికి ఆశించినమేర రాణించలేకపోయాడు. దీంతో ఇప్పటికే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు అతన్ని హెచ్చరించగా తాజాగా గంభీర్ కూడా అతడి స్థానానికి పొంచివున్న ప్రమాదం గురించి తెలియజేశాడు. అతడి ఆట మారకుంటే ఉద్వాసన  తప్పదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.