టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, బిజెపి గౌతమ్ గంభీర్ మరోసారి విరుచుకుపడ్డాడు. ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన అందరిలో కోహ్లీనే అత్యంత చెత్త సారథి అంటూ విమర్శించాడు. అయితే అతడికి మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల వల్లే గొప్ప కెప్టెన్ అన్న పేరు వచ్చిందన్నాడు. వారిద్దరిని పక్కనబెడితే కోహ్లీ కెప్టెన్సీ ఎలా వుంటుందో ఐపిఎల్ లో ఆర్సిబి ప్రదర్శనను చూస్తేనే అర్థమవుతుందన్నాడు. రోహిత్, ధోనీలులేకుండా ఆడిన మ్యాచుల్లో టీమిండియా విజయాల శాతం చాలా తక్కువగా వుందని గంభీర్ తెలిపాడు. 

''కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను అందుకుంది. అంతమాత్రాన అదంతా అతడి క్రెడిటే కాదు. ఆటగాళ్ళ అత్యుత్తమ ప్రదర్శనే కోహ్లీని అంతర్జాతీయ స్ధాయిలో ఉత్తమ కెప్టెన్ ను చేసింది. మరీ ముఖ్యంగా రోహిత్, ధోనిల వల్లే కోహ్లీ కెప్టెన్సీకి మంచి పేరు వచ్చింది. సుధీర్ఘకాలంగా వారిద్దరిలో ఎవరో ఒకరు జట్టులో వుంటూ టీమిండియానే కాదు కోహ్లీని  కూడా సేవ్ చేస్తున్నారు. 

 కోహ్లీ సారథ్యం వల్లే టీమిండియా ఈ స్థాయిలో విజయాలు అందుకుంటుందని వాదిస్తున్న వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మీరు అనుకుంటున్నట్లు అతడు అంత ప్రతిభ గల కెప్టెన్ అయితే ఐపిఎల్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఎందుకలా వుంది. కనీసం ఇప్పటివరకు ఒక్క టైటిల్ అయినా ఎందుకు సాధించలేకపోయింది? టైటిట్ మాట అటుంచితే నాకౌట్ దశను కూడా దాటడానికి ఆ జట్టు ఎందుకంత ఆపసోపాలు పడుతోంది? ఇది చాలు కోహ్లీ ఎంత చెత్త కెప్టెనో చెప్పడానికి. 

నిజంగా చెప్పాలంటూ ముంబై ఇండియన్స్ కి నాలుగు సార్లు టైటిట్ సాధించిపెట్టిన రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ నే కాదు అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ను సమర్థవంతంగా ముందుకు నడిపించిన ధోని ఓ  గొప్ప కెప్టెన్. కోహ్లీ ఎప్పటికీ వారి స్థాయిని అందుకోలేడు.ఉత్తమ  కెప్టెన్ కాలేడు''  అంటూ గంభీర్ విరుచుకుపడ్డాడు.