ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో లీగ్ దశనుండే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇలా ప్రతిష్టాత్మక ఐసిసి  టోర్నమెంట్ లో ఘోరంగా విఫలమైన జట్టులో సమూల మార్పులు చేపట్టాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ ప్రక్షాళనను నేరుగా ఆటగాళ్లతో కాకుండా సహాయక సిబ్బందితో మొదలుపెట్టింది. అందులో భాగంగానే చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ చేత రాజీనామా చేయించడంతో పాటు హెడ్ కోచ్ మిక్కి ఆర్థన్ ను తొలగించింది. వారి స్ధానాల్లో కొత్తవారిని నియమించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఈ క్రమంలోనే పిసిబి హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ  గడువు కూడా సోమవారం(ఆగస్ట్ 26) తో ముగిసింది. అయితే ఈ పదవి కోసం దరఖాస్తు  చేసుకున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ ప్రకటించాడు. ఈ పదవి కోసం తీవ్రమైన పోటీ వుందంటూనే తనకు దక్కే అవకాశాలే ఎక్కువగా వున్నాయని  ధీమా వ్యక్తం చేశాడు.  అంతర్జాతీయ స్ధాయి క్రికెటర్ గా సుధీర్ఘకాల అనుభవం, వివిధ స్థాయిల్లో జట్టుకు సేవలు అందించడం పలు అంశాలు తనకు కలిసివస్తాయని అన్నాడు. హెడ్ కోచ్ పదవిని చేపట్టేందుకు తాను అన్ని విదాలుగా అర్హుడినంటూ మిస్బా పేర్కొన్నాడు. 

అయితే ఈ  కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్, పాక్ మాజీ  క్రికెటర్ వకార్ యూనిస్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మిస్బాకు వీరిద్దరి నుండి గట్టి పోటీ ఎదురవనుంది. అయితే పిసిబి ఉన్నతాధికారుల్లో కొందరు మిస్బాకు మద్దతిస్తుండటంతో అతడికే హెడ్  కోచ్ పదవి చేపట్టు అవకాశాలున్నట్లు  తెలుస్తోంది. 

పాకిస్థాన్ జట్టు భవిష్యత్ ప్రదర్శనను నిర్ణయించే కీలకమైన చీఫ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ నియామక ప్రక్రియను పిసిబి జాగ్రత్తగా చేపడుతోంది. ఈ రెండిట్లో ఏదో ఒక పదవిని మాజీ కెప్టెన్ మిస్బా కు అప్పగించాలని పిసిబి భావిస్తోందంటూ గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ సాధ్యమైతే ఈ రెండింటిని అతడికే అప్పగించే ఆలోచనలో కూడా పిసిబి వున్నట్లు తెలిసింది.  అయితే ఇలా పాకిస్థాన్ క్రికెట్ కు చెందిన రెండు కీలక పదవుల్లో ఒక్కరినే నియమించాలన్న పిసిబి ఆలోచనను మాజీ క్రికెటర్లు కొందరు తప్పుబట్టారు. 

సంబంధిత వార్తలు

చీఫ్ కోచ్, సెలెక్టర్ వేటలో పాక్... మాజీ కెప్టెన్ వైపే పిసిబి చూపు