ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ మెగా టోర్నీలో  అత్యంత చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టు లీగ్ దశనుండే వెనుదిరిగిన విషయం తెలిసిందే.  ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టోర్నీలో ముఖ్యంగా దాయాది భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఆ దేశ అభిమానులకే కాదు క్రికెట్ పెద్దలకు అస్సలు నచ్చలేదు. దీంతో ఈ టోర్నీ తర్వాత జట్టును ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు. ఇందులోభాగంగా మొదట టీం కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లను మార్చే పనిలో పడింది. కీలకమైన చీఫ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ పదవుల్లో ఏదో ఒకటి మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ కు అప్పగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రపంచ కప్ లో పాక్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశాడు. అలాగే చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ పదవీకాలం కూడా ఇటీవలే ముగిసింది. అయితే అతడి పర్యవేక్షణలోనే సర్పరాజ్ సేన వరల్డ్ కప్ లో చతికిలపడింది. ఈ నేపథ్యంలో మళ్లీ అతన్ని కొనసాగించడానికి పిసిబి సుముఖంగా లేదు. కాబట్టి ఇలా ఖాళీ అయిన చీఫ్ కోచ్ పదవి కోసం పిసిబి ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది.  

పాకిస్థాన్ జట్టు భవిష్యత్ ప్రదర్శనను నిర్ణయించే కీలకమైన చీఫ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ నియామక ప్రక్రియను పిసిబి జాగ్రత్తగా చేపడుతోంది. ఈ రెండిట్లో ఏదో ఒక పదవిని మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ కు అప్పగించాలని పిసిబి భావిస్తోందట.  ఒకవేళ సాధ్యమైతే ఈ రెండింటిని అతడికే అప్పగించే ఆలోచనలో కూడా పిసిబి వున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం మిస్బా ప్రీ  సీజన్ కండిషనింగ్‌ క్యాంప్‌లో వున్నాడు కాబట్టే ఇప్పటివరకు చీఫ్ కోచ్ పదవికి దరకఖాస్తు  చేసుకోనట్లు తెలుస్తోంది. ఈ నెల 23తో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ మూడు రోజుల్లో మిస్బా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

అయితే ఇలా పాకిస్థాన్ క్రికెట్ కు చెందిన రెండు కీలక పదవుల్లో ఒక్కరినే నియమించాలన్న పిసిబి ఆలోచనను మాజీ కెప్టెన్ రమీజ్ రజా తప్పుబట్టాడు. ఇది పాక్ క్రికెట్ కు మరింత  చేటు చేయనుందని అతడు హెచ్చరించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను దబ్బతీయొద్దని రమీజ్ సూచించాడు.