టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్  లీగ్) జట్లల్లో కొన్నింటికి చాలా మంచి కెప్టెన్లున్నారని గంభీర్ అన్నారు. అలాంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు అత్యుత్తమ కెప్టెన్లని పేర్కొన్నారు. వీరి సరసన కోహ్లీని చేర్చడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. రాయల్ చాలెంజర్స్ జట్టును ముందుడి నడిపిస్తూ విజయాలు అందించడంలో ప్రతి సీజన్ లో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడని... అందువల్లే అతన్ని అత్యుత్తమ సారథిగా తాను భావించడంలేదని గంభీర్ వివరించాడు.

ప్రతి ఐపిఎల్ సీజన్ లోనూ బెంగళూరు జట్టు ఒకే ఆటతీరును కనబరుస్తోందని గంభీర్ అన్నాడు. ఆరంభంలో వరుస విజయాలను అందుకునే ఈ జట్టు చివరికి దశలో చెత్త ఆటతీరును కనబర్చడం పరిపాటిగా మారిందన్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ ట్రోపిని  కూడా ఆ  జట్టు ముద్దాడలేకపోయిందన్నాడు. దీన్ని బట్టే కోహ్లీ ఎంత గొప్ప కెప్టెనో అర్థం చేసుకోవాలని గంభీర్ సూచించారు. 

విరాట్ కోహ్లీని చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలతో పోల్చడం ఆపాలంటూ అభిమానులకు ఆయన సూచించారు. వీరిద్దరు కెప్టెన్లుగా ప్రతి సీజన్ లోనూ నిరూపించుకుంటూ వస్తున్నారని...ఇలా మూడేసిసార్లు  తమ తమ జట్లని ఐపిఎల్ విజేతలుగా నిలిపారని పేర్కొన్నాడు. కాబట్టి కోహ్లీ ఈ సీజన్ లో అయినా బెంగళూరు జట్టుకు ట్రోపి అందించి అత్యుత్తమ కెప్టెన్ గా మారాలని గంభీర్ సూచించారు. 

విరాట్ కోహ్లీ గత 8 సీజన్లుగా ఆర్సీబి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని గంభీర్ గుర్తు చేశారు. ఇలా కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబి 96 మ్యాచులాడగా అందులో 44 మ్యాచుల్లో మాత్రం విజయం సాధించిందన్నారు. అంటే సగానికి పైగా మ్యాచుల్లో ఓటమిపాలయ్యిందని తెెలిపాడు. ఇందులో కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే చాలా మ్యాచుల్లో ఓటమిపాలయ్యిందన్నాడు. కాబట్టి అతడు గొప్ప ఆటగాడే కావచ్చు కానీ తెలివైన కెప్టెన్ మాత్రం కాదని గంభీర్ పేర్కొన్నాడు.