ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ ఆనందం అతడికి ఎంతోకాలం నిలవలేదు.  అదే ఆస్ట్రేలియాపై ఇటీవల భారత్ లో జరిగిన వన్డే సీరిస్‌లో రిషబ్ చెత్త ప్రదర్శనతో టీమిండియా ఓటమికి కారణమై తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఇలా ఒకే జట్టుపై ఓసారి ఆకాశమే హద్దుగా సాగిన ప్రశంసలు, మరోసారి పాతాళానికి తొక్కెస్తూ సాగిన విమర్శలను రిషబ్ చవిచూశాడు. ఇలా భారత మాజీలు, విశ్లేషకులు, అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న రిషబ్ కు ఆసిస్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అండగా నిలిచారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేసే అవకాశం తనకు వస్తే తప్పకుండా ఆ జట్టులో రిషబ్ పంత్ వుంటాడన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకున్న రిషబ్ అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. అతన్ని స్పెషలిస్ట్ వికెట్ కీఫర్ గా కాకుండా బ్యాట్ మెన్ మాత్రమే జట్టులో స్ధానం కల్పిస్తానని పేర్కొన్నారు. టీమిండియాకు వరల్డ్ కప్‌ అందిచే సత్తా రిషబ్‌‌కు వుందని పాంటింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత జట్టుకు సమస్యగా మారిన నాలుగో స్థానంలో రిషబ్ రాణించగలడని అన్నారు. అయితే అందుకోసం అతడికి వరుసగా కొన్ని అవకాశాలిస్తూ ఆ స్థానంలో కుదురుకుని సత్తా చాటగలడని సూచించారు. ప్రపంచ కప్ లో కూడా అతన్ని నాలుగో స్థానంలోనే ఆడించాలని సూచించారు. తానయితే అలాగే చేస్తానని అన్నాడు. ప్రపంచ కప్ జట్టులో అతడు కీలక పాత్ర పోషిస్తాడన్న నమ్మకం తనకుందని  పాంటింగ్ తెలిపాడు. 

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సీరిస్ లలో టీమిండియా బ్యాటింగ్ వైపల్యం బయటపడింది. బ్యాటింగే ప్రధానాస్త్రంగా వరల్డ్ కప్ లో బరిలోకి దిగాలనుకున్న భారత జట్టుకు ఇలా పెద్ద సమస్య వచ్చిపడింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన వన్డే సీరిస్ లో మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో టీమిండియా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. అయితే ఇందుకు ముఖ్యకారణం నాలుగో స్ధానంలో ఆటగాళ్లెవరు రాణించకపోవడమేనన్న అభిప్రాయాన్ని  కొందరు మాజీలు వ్యక్తం చేశారు. అయితే ఈ స్థానంలో చటేశ్వర్ పుజారీ సరిగ్గా సరిపోతాడని గంగూలి  అభిప్రాయపడగా  తాజాగా పాంటింగ్ రిషబ్ కు మద్దతిచ్చాడు.