Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS: ఉప్పల్ మే సవాల్.. సిరీస్ విజేతను తేల్చనున్న భాగ్యనగరం

IND vs AUS T20I: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను  భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో  నేడు హైదరాబాద్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఇప్పటికే చెరో విజయంతో ఉన్న రెండు జట్లు.. నేటి రాత్రి ఉప్పల్‌లో తుది సమరానికి  సిద్ధమయ్యాయి. 

Uppal Stadium Ready For Big Fight, India to Face Australia in Series Decider Match on Sunday
Author
First Published Sep 25, 2022, 10:28 AM IST

భాగ్యనగరానికి మరోసారి క్రికెట్ ఫీవర్ తాకింది. మాయదారి రోగం కరోనా వల్ల మూడేండ్లుగా  హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లేక  అల్లాడిపోతున్న నగరవాసుల ‘క్రికెట్ కరువు’ను తీర్చేందుకు రెండు అగ్రశ్రేణి జట్లు నేడు నగరం నడిబొడ్డున ఉన్న ఉప్పల్ స్టేడియంలో  అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడు  మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా చెరో మ్యాచ్ గెలిచిన ఇండియా, ఆస్ట్రేలియాలు ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  మూడో టీ20కి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న  ఇరు జట్లు.. నేటి ఉదయం ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొన్నాయి. 

హైదరాబాద్‌లో 2019 లో చివరిసారి ఇండియా-వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత మూడేండ్లకు మళ్లీ మ్యాచ్ జరుగుతుండటంతో నగరవాసులు ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. అదీగాక నేడు ఆదివారం సెలవు దినం కావడంతో ఉప్పల్, పరిసర ప్రాంతాలన్నీ ‘క్రికెట్ జపం’ చేస్తున్నాయి. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొహాలీలో జరిగిన తొల టీ20లో ఆస్ట్రేలియా ఆధిపత్యం సాగించగా వర్షం వల్ల  8 ఓవర్లకు కుదించిన నాగ్‌పూర్‌లో భారత్ గెలిచింది. సిరీస్  విజేతను తేల్చే మ్యాచ్ కావడంతో రసవత్తర పోరు సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఈ  మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 

బౌలింగ్ కీలకం.. 

గత ఐదారు మ్యాచ్‌లలో భారత్ ను అత్యధిక ఆందోళనకు గురిచేస్తున్న అంశం బౌలింగ్. ఈ విభాగంలో పేలవ ప్రదర్శన కారణంగానే భారత్ ఆసియా కప్ తో పాటు ఆసీస్ తో తొలి  టీ20లో ఓటమిపాలైంది. 8 ఓవర్ల మ్యాచ్ గా జరిగిన నాగ్‌పూర్ లో  బుమ్రా తిరిగి జట్టుతో చేరడం కొంత సానుకూలాంశమే అయినా  అతడు ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడనేదానిమీదే భారత్ విజయం ఆధారపడి ఉంది. ఫామ్ లో లేని భువనేశ్వర్ కు నాగ్‌పూర్ మ్యాచ్ లో విశ్రాంతినిచ్చిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో ఆడిస్తుంది. కానీ భువీని కొంతకాలంగా వేధిస్తున్న డెత్ ఓవర్ల సమస్యను అతడు ఎలా దాటుతాడనేది కీలకం. గాయం తర్వాత  తిరిగి జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్ గత రెండు మ్యాచ్ లలో ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా  గాడి తప్పాడు.  బౌలింగ్ విభాగంలో భారత్ కు కాస్త ఊరటనిచ్చేది అక్షర్ పటేల్ ఒక్కడే. గడిచిన రెండు టీ20లలో ఆసీస్ ను కట్టడిచేసిన బౌలర్ అక్షర్ మాత్రమే.

 

బ్యాటింగ్.. కోహ్లీ కదం తొక్కాల్సిందే.. 

ఆసియా కప్ నుంచి భారత బ్యాటింగ్ లో బాగానే రాణిస్తున్నది. వరుసగా 170 ప్లస్ స్కోర్లు సాధిస్తూనే వస్తున్నది. అయితే  బౌలింగ్ వైఫల్యాల వల్ల మరుగన పడిపోతున్నా ఈ సిరీస్ లో కోహ్లీ రెండు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్ లో తిరిగి ఫామ్ ను అందుకున్న కోహ్లీ మళ్లీ  త్వరగా పెవిలియన్ చేరుతుండటం ఆందోళనకరమే.  రెండో మ్యాచ్ లో ఆడిన ఆటను రోహిత్.. హైదరాబాద్ లో కొనసాగిస్తే ఆసీస్ కు తిప్పలు తప్పవు. రాహుల్, సూర్యకుమార్, హార్ధిక్ లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చివర్లో దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ ఇస్తే కంగారూలను కంగారు పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. 

ఆసీస్.. అంత ఈజీ కాదు.. 

టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న ఆసీస్.. ఈ సిరీస్ లో నలుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా భారత్ కు చుక్కలు చూపిస్తూనే ఉంది. తొలి మ్యాచ్ లో కామెరూన్ గ్రీన్ ఆడిన ఆట టీమిండియా ఫ్యాన్స్ కు ఇంకా గుర్తే. అతడు అదే ఆటను ఉప్పల్ లో ఆడితే  అంతే సంగతులు. ఆరోన్ ఫించ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు.  మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్ లు కూడా బ్యాట్ ఝుళిపిస్తే భారత్ కు కష్టాలు తప్పవు. వీరందరికంటే గత రెండు మ్యాచ్ లలో భారత బౌలర్లను ఆటాడుకున్న మాథ్యూ వేడ్ అత్యంత ప్రమాదకారి.  ఎటువంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ ను తనవైపునకు తిప్పుకునే ఆటగాడు అతడు. టీమిండియా బౌలర్లు అతడిని త్వరగా కట్టడి చేయకుంటే పరాజయానికి అడుగులు వేసుకున్నట్టే. బ్యాటింగ్ లో రెచ్చిపోవడం వల్ల అంత పట్టించుకోవడం లేదు గానీ ఆసీస్ బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. తొలి మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు 200 పరుగులిచ్చారు. రెండో మ్యాచ్ లో రోహిత్.. ఆ బౌలింగ్ దళాన్ని చీల్చి చెండాడాడు. భారత్  లో స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై ఆడమ్ జంపా రెచ్చిపోతున్నాడు. అతడిని కాస్త నిలువరిస్తే  భాగ్యనగరిలో విజయ ‘భాగ్యం’ టీమిండియాదే.. 

 

మ్యాచ్ సమయం : ఆదివారం రాత్రి  7 గంటల నుంచి ప్రారంభం 

ఇలా చూడొచ్చు : స్టార్ నెట్వర్క్ లతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో మ్యాచ్ లైవ్ లో వీక్షించొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios