కెనడా జట్టులో 15 మందిలో 9 మంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్... మ్యాచ్ ఆడేందుకు ప్లేయర్లు అందుబాటులో లేని కారణంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్ రద్దు...

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీని కరోనా భూతం వీడడం లేదు. ఇప్పటికే భారత జట్టు బృందంలో ఆరుగురు ప్లేయర్లు కరోనా బారిన పడి, కోలుకోగా... తాజాగా కెనడా జట్టు కరోనా కేసుల కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకుంది. వెస్టిండీస్‌లో ఉన్న కెనడా అండర్ 19 జట్టులో ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు...

15 మందిలో 9 మంది ప్లేయర్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన ప్లేయర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి కెనడాది. దీంతో ఈ రోజు స్కాట్లాండ్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి తప్పుకుని, స్వదేశానికి వెళుతున్నట్టు ప్రకటించింది కెనడా జట్టు...

‘అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరమైన విషయం. అయితే కుర్రాళ్ల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి మెరుగైన భద్రత, వైద్య సదుపాయాలు కల్పించేందుకే స్వదేశానికి తీసుకెళ్తాం... ఐసోలేషన్‌ గడిపి, పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లేయర్లను ఇంటికి పంపిస్తాం...’ అని తెలియచేశారు కెనడా క్రికెట్ (సీసీ) ప్రెసిడెంట్ రాష్‌పాల్ భజ్వా...

ప్లేయర్లతో పాటు కెనడా టీమ్ మేనేజర్, మిగిలిన సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం. ప్రస్తుతం ట్రినిడాడ్‌లో ఐసీసీ నిర్దేశించిన బయో బబుల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కెనడా జట్టు, ప్రత్యేక చార్టెట్ ఫ్లైట్‌లో స్వదేశానికి పయనం కానుంది.

భారత జట్టు కెప్టెన్ యష్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు భారత ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. అయితే భారత బృందంపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండానే ఉగాండా, ఐర్లాండ్‌లపై భారీ విజయాలు అందుకుంది టీమిండియా...

ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో విజయం అందుకు యువ భారత జట్టు, ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 326 పరుగుల రికార్డు తేడాతో విజయాన్ని అందుకుంది. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 పరుగులు చేసిన రాజ్ భవ, అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు...

నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలబడబోతోంది భారత అండర్-19 టీమ్. అండర్-19 వరల్డ్ కప్ 2019 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా అండర్-19 వరల్డ్‌కప్ 2022 టోర్నీని ఆరంభించిన బంగ్లాదేశ్, మరో విజయంతో సెమీస్ చేయాలని పట్టుదలతో ఉంది...

గ్రూప్ 1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీ ఫైనల్‌1కి అర్హత సాధించాయి. టీమ్ 2 నుంచి ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్‌ 2కి అర్హత సాధించగా... నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆస్ట్రేలియాతో తలబడనుంది...