Asianet News TeluguAsianet News Telugu

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా... శ్రీలంక జట్టుతో ఢీ...

బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 103 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం... మరో సెమీస్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసిన శ్రీలంక... డిసెంబర్ 31న భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్...

Under 19 Asia Cup: Team India reaches final after Beating Bangladesh U19, SriLanka U19 beats Pakistan
Author
India, First Published Dec 30, 2021, 5:51 PM IST

అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లా అండర్-19 జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది యువ భారత జట్టు. డిసెంబర్ 31న శ్రీలంక జట్టుతో అండర్19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా.

సెమీస్‌లో 244 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లా జట్టు, 38.2 ఓవర్లలో 140 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బంగ్లా తరుపున అరిఫుల్ ఇస్లాం 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా ఓపెనర్ మహ‌ఫిజుల్ ఇస్లాం 26 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రాజ్‌వర్థన్ హంగేర్కర్ , రవికుమార్, రాజ్ భవ, విక్కీ ఓత్సవల్ రెండేసి వికెట్లు తీయగా నిశాంత్ సింధు, కుశాల్ తంబే చెరో వికెట్ తీశారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేయగా, 41 బంతుల్లో 16 పరుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ఒక్క బౌండరీ కూడా బాదకుండానే పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత నిశాంత్ సంధు 5 పరుగులకే అవుట్ కావడంతో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత అండర్-19 టీమ్. ఈ దశలో కెప్టెన్ యశ్ దుల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి, నాలుగో వికెట్‌కి తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌తో కలిసి 41 పరుగులు జోడించాడు.  ఆ తర్వాత 40 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన రాజ్ భవతో కలిసి ఐదో వికెట్‌కి 46 పరుగులు జోడించిన షేక్ రషీద్... పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్స్ తీయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

కుశాల్ తంబే 3, ఆరాధ్య యాదవ్ 8 పరుగులు చేసి అవుట్ కాగా రాజ్‌వర్థన్ హంగర్కేకర్ 7 బంతుల్లో  ఓ ఫోర్, 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షేక్ రషీద్ 108 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 18 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన విక్కీ వత్సల్ ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు...

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపికైనా షేక్ రషీద్, ఆసియా కప్ టోర్నీలో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా కీలక మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు. 

బంగ్లా కెప్టెన్ రకీబుల్ హసన్ 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హసన్ సకీబ్, రోహ్మన్, మెహెరోబ్, అరిఫుల్ ఇస్లాం తలా ఓ వికెట్ తీశారు. 

మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక, ఫైనల్‌కి అర్హత సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, శ్రీలంక జట్టును 44.5 ఓవర్లలో  147 పరుగులకి ఆలౌట్ చేసింది. జీశన్ జమీర్ 4 వికెట్లు తీయగా అహ్మద్ ఖాన్, అవైస్ ఆలీ రెండేసి వికెట్లు తీశారు. అర్హమ్ నవాబ్, మర్జ్ సదావత్ చెరో వికెట్ తీశారు. 

148 పరుగుల ఈజీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ సదావత్, వికెట్ కీపర్ హసీబుల్లా డకౌట్ కాగా, మహ్మదుల్లా షాజద్ 75 బంతుల్లో ఓ ఫోర్‌తో 30 పరుగులు, కెప్టెన్ ఖాసీం అక్రమ్ 19, ఇర్ఫాన్ ఖాన్ 13, అహ్మద్ ఖాన్ 36, రిజ్వాన్ మహ్మద్ 6 పరుగులు, జీషన్ జమీర్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 49.3 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయినా పాకిస్తాన్ జట్టు, 22 పరుగుల తేడాతో ఓడింది. 

లంక బౌలర్లలో త్రీవీన్ మాథ్యూ 10 ఓవర్లలో 3 మెయిడిన్లతో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios