Asianet News TeluguAsianet News Telugu

అండర్19 ఆసియా కప్: టీమిండియాని ఆదుకున్న తెలుగు కుర్రాడు రషీద్... బంగ్లాతో సెమీస్‌లో...

U19IND vs U19BAN: 50 ఓవర్లలో 243/8 స్కోరు చేసిన టీమిండియా... అజేయంగా 90 పరుగులతో ఆకట్టుకున్న షేక్ రషీద్...

Under 19 Asia cup: Shaik Rasheed  innings helped team India scored reasonable total
Author
India, First Published Dec 30, 2021, 3:45 PM IST

అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లా యువ జట్టు, మరో ఆలోచన లేకుండా టీమిండియాకి బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేయగా, 41 బంతుల్లో 16 పరుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ఒక్క బౌండరీ కూడా బాదకుండానే పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత నిశాంత్ సంధు 5 పరుగులకే అవుట్ కావడంతో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత అండర్-19 టీమ్. ఈ దశలో కెప్టెన్ యశ్ దుల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి, నాలుగో వికెట్‌కి తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌తో కలిసి 41 పరుగులు జోడించాడు.  ఆ తర్వాత 40 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన రాజ్ భవతో కలిసి ఐదో వికెట్‌కి 46 పరుగులు జోడించిన షేక్ రషీద్... పరిస్థితులకు తగ్గట్టుగా సింగిల్స్ తీయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

కుశాల్ తంబే 3, ఆరాధ్య యాదవ్ 8 పరుగులు చేసి అవుట్ కాగా రాజ్‌వర్థన్ హంగర్కేకర్ 7 బంతుల్లో  ఓ ఫోర్, 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షేక్ రషీద్ 108 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 18 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన విక్కీ వత్సల్ ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు...

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపికైనా షేక్ రషీద్, ఆసియా కప్ టోర్నీలో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా కీలక మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు. 

బంగ్లా కెప్టెన్ రకీబుల్ హసన్ 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హసన్ సకీబ్, రోహ్మన్, మెహెరోబ్, అరిఫుల్ ఇస్లాం తలా ఓ వికెట్ తీశారు. మరో సెమీ ఫైనల్‌లో శ్రీలంక జట్టును 44.5 ఓవర్లలో  147 పరుగులకి ఆలౌట్ చేసింది పాకిస్తాన్. జీశన్ జమీర్ 4 వికెట్లు తీయగా అహ్మద్ ఖాన్, అవైస్ ఆలీ రెండేసి వికెట్లు తీశారు. అర్హమ్ నవాబ్, మర్జ్ సదావత్ చెరో వికెట్ తీశారు. 

అండర్-19 వరల్డ్ కప్ 2019 టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన యువ భారత జట్టు, ఈ సారి ఆ జట్టును సెమీస్‌లోనే ఓడించాలని తాపత్రయపడుతోంది. లక్ష్యఛేదనలో 10 ఓవర్లు ముగిసే సమయానికి  50 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. సెమీస్‌లో బంగ్లాపై భారత జట్టు, శ్రీలంకపై పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం దొరుకుతుంది...

గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడిన భారత జట్టు, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అండర్-19 ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత వచ్చే నెలలో వరల్డ్ కప్ టోర్నీ కూడా జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios