Fastest Delivery in IPL 2022: ఐపీఎల్ లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్ల తో పాటు బౌలర్లకూ రెడ్ అలర్ట్ పంపాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్మూ ఎక్స్ప్రెస్ రాకెట్ స్పీడ్ తో దూసుకొస్తున్నది. తన వేగానికి ముందున్న రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి.
ఐపీఎల్-15లో ఫాస్టెస్ట్ డెలివరీలతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్న జమ్మూ ఎక్స్ప్రెస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ లో వేగంలో తనను బీట్ చేసే బౌలర్ లేడంటూ, ఒకవేళ ఎవరైనా ఉంటే అదీ తానేనని నిరూపించింది. భారతదేశ చిత్రపటంలో పైభాగాన ఉండే జమ్మూ నుంచి దూసుకొస్తున్న ఈ పేస్ తుఫాన్ పేరు ఉమ్రాన్ మాలిక్. ఇప్పటికే ఈ ఐపీఎల్ లో గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఈ బౌలింగ్ సంచలనం.. తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా గంటకు 154 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.
హైదరాబాద్-చెన్నై మధ్య ఆదివారం రాత్రి పూణేలో జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్.. రెండు సార్లు 154 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు. తద్వారా ఇదే ఐపీఎల్-15 లో తనకంటే కాస్త ఎక్కువ వేగంతో (153.9 కి.మీ) బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ లీగ్ లో ఫాస్టెస్ట్ డెలివరీల జాబితాలో టాప్-5లో 4 స్థానాలు ఉమ్రాన్ వే కావడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో పదో ఓవర్ లో రుతురాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓసారి.. తర్వాత 19వ ఓవర్లో ధోని క్రీజులో ఉండగా మరోసారి 154 కి.మీ. వేగంతో బంతులను సంధించాడు. తద్వారా ఈ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. 9 మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
- ఆడిన 9 మ్యాచుల్లో ఫాస్టెస్ట్ డెలివరీలు ఉమ్రాన్ మాలిక్ కే సొంతమయ్యాయి.
ఐపీఎల్ చరిత్ర లో అత్యంత వేగవంతమైన బంతులు వేసింది టాప్-5 బౌలర్లు వీళ్లే..
- షాన్ టైట్ : 157.71 కి.మీ. (2011- రాజస్తాన్ రాయల్స్)
- అన్రిచ్ నోర్త్జ్ : 156.22 కి.మీ (2020 - ఢిల్లీ క్యాపిటల్స్)
- డేల్ స్టేయిన్ : 154. 40 కి.మీ (2012 - డెక్కన్ ఛార్జర్స్)
- కగిసొ రబాడా : 154.23 కి.మీ (2020- ఢిల్లీ క్యాపిటల్స్)
- ఉమ్రాన్ మిలిక్ : 154 కి.మీ (2022 - సన్ రైజర్స్ హైదరాబాద్)
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసింది పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్. 2002లో అక్తర్.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఆ తర్వాత షాన్ టైట్ (న్యూజిలాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) లు 160 కి.మీ. వేగంతో బాల్స్ వేశారు. ఇక 154 కి.మీ. పూర్తి చేసిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే 155 కి.మీ. ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. అది కూడా పూర్తి చేస్తే ఇక నెక్స్ట్ షోయభ్ అక్తర్ రికార్డు మీదే గురి పెట్టనున్నాడు.
