TATA IPL 2022: తన వేగంతో ఐపీఎల్-2022 లో రికార్డులు బద్దలుకొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఏకంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు.
ప్రతి ఐపీఎల్ సీజన్ పలువురు అనామక ఆటగాళ్ల టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ సీజన్ లో ఆ జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరు ఉమ్రాన్ మాలిక్. వేగానికి తోడు వైవిధ్యం కలగలిసిన బంతులతో నానాటికీ రాటుదేలుతున్న ఈ కాశ్మీరి కుర్రాడు.. సంచలన ప్రదర్శనలతో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో పాస్టెస్ట్ డెలివరీలన్నీ తన పేరుమీదే నమోదు చేసుకున్న ఈ జమ్మూ ఎక్స్ప్రెస్.. తాజాగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో బంతిని వేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్.. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన జాబితాలో ఇది రెండో ప్రదర్శన. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతిని గంటకు 157 కిమీ వేగంతో విసిరాడు. ఈ ఐపీఎల్ లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ.
ఈ జాబితాలో షాన్ టైట్ (గంటకు 157.71 కి.మీ) తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రికార్డు ఉమ్రాన్ దే. సీఎస్కే తో మ్యాచ్ లో 154 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. తాజాగా తన రికార్డుతో పాటు నోర్త్జ్, రబాడా, తన గురువు డేల్ స్టెయిన్ రికార్డులను కూడా బద్దలుకొట్టాడు.
ఐపీఎల్ చరిత్ర లో అత్యంత వేగవంతమైన బంతులు వేసింది టాప్-5 బౌలర్లు వీళ్లే..
- షాన్ టైట్ : 157.71 కి.మీ. (2011- రాజస్తాన్ రాయల్స్)
- ఉమ్రాన్ మాలిక్ : 157 కి.మీ (2022 - సన్ రైజర్స్ హైదరాబాద్)
- అన్రిచ్ నోర్త్జ్ : 156.22 కి.మీ (2020 - ఢిల్లీ క్యాపిటల్స్)
- డేల్ స్టేయిన్ : 154. 40 కి.మీ (2012 - డెక్కన్ ఛార్జర్స్)
- కగిసొ రబాడా : 154.23 కి.మీ (2020- ఢిల్లీ క్యాపిటల్స్)
తర్వాత టార్గెట్ అదే..
ఈ ఐపీఎల్ లో 157 కి.మీ. టార్గెట్ ఛేదించిన ఉమ్రాన్.. ఇక తన తర్వాతి లక్ష్యం అక్తర్ రికార్డును బ్రేక్ చేయడమే. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసింది పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్. 2002లో అక్తర్.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఆ తర్వాత షాన్ టైట్ (న్యూజిలాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) లు 160 కి.మీ. వేగంతో బంతులు విసిరారు. మరి ఈ ఐపీఎల్ లోనే ఉమ్రాన్ ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఆశిద్దాం.
