రెండో టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ని చిత్తు చేసిన యూఏఈ... అసోసియేట్ దేశం చేతుల్లో న్యూజిలాండ్‌కి తొలి ఓటమి..
టీ20 క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, 16వ ర్యాంకు యూఏఈ చేతుల్లో చిత్తుగా ఓడింది. మొదటి టీ20 మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో పోరాడి ఓడిన యూఏఈ, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం అందుకుంది..
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఛాడ్ బోస్ 21, టిమ్ షిఫర్ట్ 7, మిచెల్ సాట్ర్ 1 పరుగు చేసి అవుట్ కాగా డేన్ క్లెవర్ డకౌట్ అయ్యాడు. మార్క్ ఛాప్‌మన్ 46 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేయగా మెక్‌కోనీ 9, జేమ్స్ నీశమ్ 21, రచిన్ రవీంద్ర 2, కేల్ జెమ్మీసన్ 8, టిమ్ సౌథీ 4 పరుగులు చేశారు..
యూఏఈ బౌలర్ ఆయన్ ఖాన్ 3 వికెట్లు తీయగా జావాదుల్లా 2 వికెట్లు తీశాడు. 143 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది యూఏఈ. ఆయాన్ష్ శర్మ డకౌట్ కాగా ముహమ్మద్ వసీం 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. విత్య అరవింద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు.
అసిఫ్ ఖాన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేయగా బాసిల్ హబీద్ 12 పరుగులు చేశాడు. టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, కేల్ జెమ్మీసన్ తలా ఓ వికెట్ తీసినా యూఏఈ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
ఓ అసోసియేట్ టీమ్ చేతుల్లో న్యూజిలాండ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో టాప్ 12లో ఉన్న ప్రతీ జట్టు కూడా ఏదో ఒక అసోసియేట్ టీమ్‌తో ఓడినట్టు అయ్యింది. 1979లో అప్పటికి అసోసియేట్ టీమ్‌గా ఉన్న శ్రీలంక చేతిలో మ్యాచ్ ఓడిపోయింది టీమిండియా. 1983లో ఆస్ట్రేలియాకి జింబాబ్వే ఊహించని షాక్ ఇవ్వగా, 1992లో అదే జింబాబ్వే చేతుల్లో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది.
1996లో కెన్యా చేతుల్లో వెస్టిండీస్ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత తాజాగా స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాల చేతుల్లోనూ చిత్తుగా ఓడింది వెస్టిండీస్. 1999లో అసోసియేట్ దేశంగా ఉన్న బంగ్లాదేశ్ చేతుల్లో పాకిస్తాన్ ఓటమి చవిచూడగా, 2003లో కెనడా చేతుల్లో పరాజయం అందుకుంది బంగ్లాదేశ్..
2003లో కెన్యా జట్టు, శ్రీలంక, జింబాబ్వే జట్లకు షాక్ ఇచ్చింది. 2018లో స్కాట్లాండ్- ఆఫ్ఘాన్‌ని, నెదర్లాండ్స్- ఐర్లాండ్‌ని ఓడించాయి. గత ఏడాది నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోయింది.
