కరోనా వైరస్ బారినపడుతున్న క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఇద్దరు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి సుమారు 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. వారి పేర్లను క్రికెట్ దక్షిణాఫ్రికా బయటకి చెప్పలేదు.

ఆగస్టు 18 నుంచి 22 వరకు కుకుజాలో పురుషుల జట్టుకు సీఎస్ఏ సాంస్కృతిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి కోవిడ్ 19 ఉన్నట్లు తేలింది.

వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు నిబంధనల ప్రకారం పరీక్షలు చేశామని.. ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌కు పంపించామని సీఎస్ఏ తెలిపింది. వారికి ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపిక చేయలేదని.. అనుకోని కారణాలతో శిబిరానికి రాలేని వారిని వర్చువల్‌గా హాజరవ్వాలని సూచించామని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది.

మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ ఫా డుప్లెసిస్ ఈ శిబిరానికి హాజరుకాలేదు. అతడు రెండోసారి తండ్రి కావడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. దియూనిస్ డీబ్రూన్ కుటుంబ కారణాలతో మొదట మిస్సైనప్పటికీ ఇప్పుడు కుకుజాలో జట్టుతో కలిశాడు.