బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 32 ఏళ్ల ఆస్ట్రేలియా జైత్రయాత్రకు భారత్ చెక్ పెట్టింది
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 32 ఏళ్ల ఆస్ట్రేలియా జైత్రయాత్రకు భారత్ చెక్ పెట్టింది.
సాధారణంగానే గబ్బా మైదానం అంటేనే ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన వేదిక.. 32 ఏళ్లుగా అక్కడ ఆడిన ఒక్క టెస్టులోనూ ఆస్ట్రేలియా ఓడింది లేదు. ఇప్పుడు టీమిండియా గబ్బాలో విజయం సాధించడం ద్వారా ఆసీస్ 32 ఏళ్ల జైత్రయాత్రకు తెరదించింది.
గబ్బాలో ఆసీస్ ఇప్పటి వరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
Also Read:గిల్ హై కీ మాన్ తా నహీ: శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు
ఇక 1988లో వివ్ రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఇప్పటి వరకు ఒక్క టెస్టులో కూడా కంగారూలు ఓడిపోలేదు. అలాంటి చోట నెగ్గడంతో పాటు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో భారత జట్టుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇప్పటి వరకు ఇది భారత్ సాధించిన గొప్ప టెస్ట్ సిరీస్ విజయాలలో ఒకటిగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందించారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తదితరులు భారత జట్టును ప్రశంసించారు.
అయితే ఇండియాను పొగడటంతో పాటు ఆస్ట్రేలియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెట్టింట్లో ఫన్నీ మీమ్స్ వైరలవుతున్నాయి. పట్టాల మీదకు వస్తున్న బస్సును ఆస్ట్రేలియా బౌలింగ్‌గా పోల్చిన నెటిజన్లు... పంత్, గిల్‌లను వేగంగా వస్తున్న రైలుగా పెట్టి బస్సును ఢీకొట్టి వెళ్లినట్లు మీమ్ తయారు చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
