క్రికెట్ అయినా, సినిమా అయినా వాయిదా పడేకొద్దీ వ్యయం పెరుగుతూ పోతూ ఉంటుంది. సరైన సమాయానికి నిర్వహిస్తే, అయ్యే ఖర్చు కంటే భారీ మొత్తంలో వ్యయం భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన టోక్యో ఒలింపిక్స్... కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్ గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ రాకపోవడంతో వచ్చే ఏడాదైనా ఒలింపిక్స్ కరెక్ట్ టైమ్‌కి జరుగుతాయా? అనేది అనుమానమే. అయితే ఏడాది వాయిదా పడిన కారణంగా ఒలింపిక్స్ వ్యయం రూ.15 వేల కోట్లు పెరిగిందట. 2021 విశ్వక్రీడలకు ఆతిథ్య ఇవ్వనున్న జపాన్ మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది.

ఒలింపిక్స్ 2020 కోసం ప్రతిష్టాత్మకంగా అనేక ఏర్పాట్లు చేసింది జపాన్. జపాన్ ఒలింపిక్స్ కోసం స్పోర్ట్స్ సిటీని నిర్మించింది. అధికారికంగా ఈ నిర్వహణ కోసం జపాన్‌కి అయ్యే ఖర్చు 12.6 బిలియన్ల డాలర్లు (అంటే 93 వేల కోట్ల రూపాయలకు పైగా).

అధునాతన సాంకేతిక ఉట్టిపడేలా ఒలింపిక్స్‌ను నిర్వహించాలనుకున్న జపాన్‌కి షాక్ ఇచ్చింది కరోనా. ఏడాది పాటు పనులన్నీ నిలిపివేయడంతో నిర్వహణ ఖర్చులు, నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. వచ్చే ఏడాది జూలై 23న షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ 2021 ప్రారంభం కావాల్సి ఉంది.